- సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహన్
సిద్దిపేట రూరల్, గజ్వేల్, వెలుగు : ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా సన్న వడ్లను మొత్తం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే కొనాలని సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టర్ మనుచౌదరితో కలిసి గజ్వేల్, కొండపాక మండలం దుద్దెడ మార్కెట్ యార్డ్ లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తేమ శాతం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు దొడ్డు రకం, సన్న రకం వడ్లు ఎంత శాతం వస్తున్నాయో తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టరేట్ లో అధికారులు, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని ఇప్పటివరకు 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందన్నారు. రూ.171 కోట్ల 56 లక్షల విలువైన 73, 947 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు.
రైతులు సన్నాలను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని రూ.500 బోనస్ పొందాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, డీఎం సివిల్ సప్లై ప్రవీణ్, డీఆర్డీఏ జయదేవ్, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, మిల్లర్లు పాల్గొన్నారు.