సివిల్ సప్లయిస్ హమాలీ చార్జీ రూ.3 పెంపు

సివిల్ సప్లయిస్ హమాలీ చార్జీ రూ.3 పెంపు
  • స్వీపర్లకు వేతనం రూ.వెయ్యి పెంపు
  • జీవో జారీ చేసిన సివిల్​ సప్లయ్స్​ వీసీఎండీ

హైదరాబాద్​, వెలుగు: సివిల్ సప్లయిస్ హమాలీ కార్మికులకు, స్వీపర్లకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హమాలీ రేట్లు, స్వీపర్ల వేతనం పెంచుతూ సివిల్ సప్లయ్స్​కార్పొరేషన్​వైస్‌చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (వీసీ అండ్‌ ఎండీ) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లు, జీసీసీ పాయింట్లలో పనిచేస్తున్న హామాలీలకు చార్జీలు క్వింటాల్​కు రూ.3 పెంచింది. 

అదే విధంగా సివిల్​ సప్లయ్స్​గోదాముల్లో పనిచేసే స్వీపర్లకు వేతనాన్ని అదనంగా మరో రూ.1000 పెంచుతూ సివిల్​ సప్లయ్స్​నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న కార్మికులకు క్వింటాల్​కు లోడింగ్​, అన్​లోడ్​కు కలిపి క్వింటాల్​కు రూ.26.50 ఇస్తుండగా, మండల కేంద్రాల్లో 26 రూపాయలు ఇస్తున్నది.  అయితే ప్రభుత్వం దానికి మరో రూ.3 పెంచింది. పెంచిన ధరలతో జీహెచ్ఎంసీ పరిధిలో క్వింటాల్​కు రూ.29.50లు, మండల కేంద్రాల్లో రూ.29 ఇవ్వనుంది.  

ఇక గోదాముల్లో  పనిచేస్తున్న స్వీపర్లకు 500 టన్నులకు ప్రస్తుతం రూ.5వేలు ఇస్తుండగా దాన్ని రూ.6వేలకు పెంచింది. 501 టన్నుల నుంచి వెయ్యి టన్నుల గోదాంలో పనిచేస్తున్న స్వీపర్లకు రూ.5500 ఇస్తుండగా రూ.6500లకు, వెయ్యి టన్నుల గోదాంలో పనిచేస్తున్న స్వీపర్లకు రూ.6 వేల నుంచి రూ.7వేలు పెంచింది. సీఎస్సీ ఎంఎల్ఎస్ పాయింట్స్, జీసీసీ పాయింట్స్ హమాలీ కార్మికులు, సీఎస్సీ ఎంఎల్ఎస్ పాయింట్స్ లో పనిచేస్తున్న స్వీపర్లకు ప్రోత్సాహాలు రూ.6500 నుంచి రూ.7500లకు ప్రభుత్వం పెంచింది. అంతే కాకుండా.. హమాలీ డ్రెస్సుల స్టిచ్చింగ్ చార్జీలు రూ.1300 నుంచి రూ.1600లకు పెంచింది. స్వీపర్ల స్టిచ్చింగ్ చార్జీ 200లను అధేవిధంగా కొనసాగిస్తున్నట్లు సోమవారం ప్రకటించిన ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.