
ఇండియన్ బ్యూరోక్రసీలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‍ఎస్ లాంటి మొత్తం 24 కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు వీలు కల్పించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2022 నోటిఫికేషన్‍ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 861 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సివిల్స్ నోటిఫికేషన్, సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుందాం..
ప్రభుత్వ శాఖల్లో పాలసీ మేకర్స్‌గా మారి, ప్రజా సేవ చేసేందుకు ఆసక్తి ఉన్న వారికి సివిల్స్ మంచి అవకాశం, ఉన్నతమైన హోదాతో పాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు వీటి ప్రత్యేకత. సివిల్ సర్వీస్ అభ్యర్థులకు ఉండాల్సిన కనీస విద్యార్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీలో మార్కుల శాతం కనీసం ఇంత ఉండాలని ఎటువంటి నిబంధనేమీ లేదు. జనరల్ అభ్యర్థులు 6 సార్లు, ఓబీసీలు 9, దివ్యాంగులు 9 సార్లు పరీక్ష రాసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు అటెంప్ట్స్ పై పరిమితి లేదు.
ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమ్స్: సివిల్స్ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్ (పేపర్-1), సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పేపర్-2) ఆబ్జెక్టివ్ పద్ధతిలో నాలుగు వందల మార్కులకు ఉంటాయి. సమయం రెండు గంటలు. పేపర్ 2 క్వాలిఫైయింగ్ పేపర్. దీనిలో కనీసం 33 శాతం మార్కులు రావాలి. ప్రిలిమ్స్ మార్కులను మెరిట్‍లో పరిగణనలోకి తీసుకోరు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.33 శాతం కోత విధిస్తారు.
మెయిన్స్: ఇందులో 9 పేపర్లుంటాయి. ఇందులో మొదటి విభాగంలో 300 మార్కుల చొప్పున పేపర్–ఎ (ఇండియన్ లాంగ్వేజ్), పేపర్–బి(ఇంగ్లిష్) ఉంటాయి. ఇవి కేవలం అర్హత పేపర్లు, కనీసం 75 మార్కులు సాధించాలి. అన్ని పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో రాయాల్సి ఉంటుంది. రెండో విభాగంలో మొత్తం ఏడు పేపర్లుంటాయి. ఇంటర్వ్యూ జాబితా రూపకల్పనకు ఇందులో పొందే మార్కులే కీలకం. జనరల్ ఎస్సే, నాలుగు జనరల్ స్టడీస్(జీఎస్) పేపర్లు, ఆప్షనల్ పేపర్లు రెండు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 250 మార్కుల చొప్పున మొత్తం 1750 మార్కులు ఉంటాయి. అభ్యర్థి పూర్తి స్థాయి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఇందులో పరీక్షలు ఉంటాయి. వీటిని ఇంగ్లిష్ లేదా ఎనిమిదో షెడ్యూల్లో ఉన్న ఏదైనా ఒక భాషలో రాయవచ్చు..
ఇంటర్వ్యూ: మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని పోస్టుకు ఇద్దరు చొప్పున మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులుంటాయి. అంటే మెయిన్స్, ఇంటర్వ్యూకు కలిపి మొత్తం మార్కులు 2025. ఈ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఉమ్మడి ప్రిపరేషన్.. ఆప్షనల్ కీలకం
సివిల్స్ పరీక్షకు యూపీఎస్సీ నుండి ప్రకటన వెలువడిన నాటి నుంచి కూడా మెయిన్స్ కోణంలోనే ప్రిపరేషన్ కొనసాగించాలి. మ్యాథ్స్ మీద పట్టులేని అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులు సీశాట్‌పై దృష్టి పెట్టాలి. ఆప్షనల్లో రెండు పేపర్లపై ఫోకస్ చేయాలి. అభ్యర్థులు సొంత మెటీరియల్ ప్రిపేర్ చేసుకొని ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవాలి. ఆప్షనల్ సబ్జెక్టు ఏదైప్పటికీ పీజీ స్థాయిలో ప్రిపరేషన్ ఉంటేనే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. సివిల్స్ మెయిన్స్‌లో రైటింగ్‌కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ప్రిపరేషన్ మొదలుపెట్టిన నాటి నుంచే డిస్క్రిప్టివ్ అప్రోచ్ ఉంటే విజయం సాధించవచ్చు.
సిలబస్
పేపర్-1
జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన తాజా సంఘటనలు
భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం
భారత, ప్రపంచ భౌగోళికశాస్త్రం - ప్రపంచ, భారత దేశ భౌతిక, సామాజిక, ఆర్థిక భౌగోళిక శాస్త్రం
భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన - రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్, పౌర విధానం, హక్కుల సమస్యలు, తదితర అంశాలు
ఆర్థిక, సామాజిక అభివృద్ధి - సమ్మిళిత అభివృద్ధి, పేదరికం, ద్రవ్యోల్బణం, డెమోగ్రాఫిక్స్, సామాజిక రంగ కార్యక్రమాలు
పర్యావరణం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు- సాధారణ అంశాలు
పేపర్-2
కాంప్రెహెన్షన్ ప్యాసేజ్
ఇంటర్‌పర్సనల్ స్కిల్స్
లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ
డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్
జనరల్ మెంటల్ ఎబిలిటీ
బేసిక్ న్యూమరసీ (పదోతరగతి స్థాయి)
డేటా ఇంటర్‌ప్రిటేషన్
ప్లాన్ చేయండిలా..
మొదటిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్ధులు 40 రోజుల పాటు జనరల్ స్టడీస్ చదవడం వల్ల ప్రిలిమినరీ తో పాటు మెయిన్స్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. మిగతా 80 రోజులు ప్రిలిమినరీకి సంబంధించిన సిలబస్‌కు ప్రిపేరవుతూ కరెంట్ అఫైర్స్‌ను జనరల్ స్టడీస్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మొదటిసారి రాస్తున్న అభ్యర్ధులు ఫ్రీ మైండ్‌తో రాయడం సానుకూల అంశంగా గుర్తించాలి. రెండో సారి సివిల్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్న వారు ముందు పరీక్ష రాసిన అనుభవం ఉన్నందున ఎక్కువ టైమ్ ప్రాక్టీస్‌కు ఉపయోగించాలి. వీరు మొదటి 60 డేస్ ప్రిలిమినరీ తో పాటు మెయిన్స్‌కు సంబంధించిన అంశాలు చదువుతూ మిగతా 60 రోజులు పూర్తిగా ప్రిలిమినరీపై దృష్టి పెట్టాలి. ఇది వరకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్ధులు మొదటి 60 రోజులు పూర్తిగా జనరల్ స్టడీస్ కోణంలో చదువుతూ కరెంట్ అఫైర్స్‌కు అనుసంధానం చేసుకోవాలి. ఈ టైమ్‌లో ఎస్సే పేపర్‌ను కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. మిగిలిన 60 రోజులు ప్రిలిమినరీ పరీక్షపై దృష్టి పెట్టాలి.
నోటిఫికేషన్
మొత్తం పోస్టులు: 861
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులూ అప్లై చేసుకోవచ్చు.
వయసు: 1 ఆగస్టు 2022 నాటికి 21 ఏళ్లు తగ్గకుండా, 32 ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష ( ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్ ఎగ్జామ్: 5 జూన్ 2022.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
చివరి తేది: 22 ఫిబ్రవరి
వెబ్సైట్: www.upsc.gov.in