సివిల్స్ మెంటార్ బాలలత స్పెషల్ ఇంటర్వ్యూ

సివిల్స్ మెంటార్ బాలలత స్పెషల్ ఇంటర్వ్యూ
  • సివిల్స్ కు ఎంపికైన 14 మంది అభ్యర్థుల మెంటార్ గా ఖ్యాతి
  • సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. కోచింగ్ సెంటర్ ఏర్పాటు
  • వైకల్యాన్ని అధిగమించి..సివిల్స్ అభ్యర్థులకు మార్గదర్శిగా నిలుస్తున్న వైనం

ఒక కొవ్వొత్తి మరో కొవ్వొత్తిని వెలిగించగలదు !! ప్రపంచానికి వెలుగులను  పంచగలదు !! ఈసారి సివిల్స్ కు ఎంపికైన 14 మంది తెలుగు అభ్యర్థుల వెనుక .. ఒక మహిళామణి ఉన్నారు. స్ఫూర్తిని పంచుతూ, ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, ప్రిపరేషన్ వ్యూహాన్ని నేర్పుతూ ఆమె నేర్పిన పాఠాలే వారిని విజయతీరాలకు చేర్చింది. ఆమె మరెవరో కాదు.. హైదరాబాద్ లోని ‘సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ’ చైర్మన్ బాలలత. గత 20 ఏళ్లుగా ఆమె మెంటార్ షిప్ లో శిక్షణ పొందిన వందలాది మంది  సివిల్స్ కు ఎంపికయ్యారు. పోలియో మహమ్మారి కబళించి రెండు కాళ్లూ పనిచేయకపోయినా.. ఆమె ఆత్మవిశ్వాసంతో తొలి ప్రయత్నంలోనే 2004 -05లో సివిల్స్ సాధించారు. బాలలత విజయగాథే.. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీలో చేరే అభ్యర్థులకు స్ఫూర్తిమంత్రంగా మారుతోంది. గత ఓటమితోనూ.. భావి విజయానికి బాటలు వేసుకునే ఆత్మస్థైర్యాన్ని అందిస్తోంది. ఆమెతో ‘వీ6’ ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలివీ.. 

మీ సివిల్స్ ప్రస్థానం గురించి చెప్పండి.. 

నేను తొలిసారి 2004 -05లో సివిల్స్ రాశాను. అప్పుడు నా వయసు 23 ఏళ్లు. 90 శాతం వైకల్యంతో.. వీల్ చైర్ లోనే కూర్చోవాల్సిన పరిస్థితి. అయినా ఆత్మవిశ్వాసంతో బాగా కష్టపడి చదివి, సివిల్స్ లో 399వ ర్యాంక్ సాధించాను. 12 ఏళ్లపాటు డిఫెన్స్ లో పనిచేశాను. ఆ సమయంలోనూ నా దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వచ్చేవాళ్లు. వాళ్లందరికీ గైడెన్స్ ఇచ్చేదాన్ని. నా దగ్గర సూచనలు తీసుకున్న చాలామంది అభ్యర్థులకు అప్పట్లోనే సివిల్స్ ర్యాంకులు వచ్చాయి. నేను కూడా 2016లో మళ్లీ సివిల్స్ రాశాను. ఆలిండియా 167వ ర్యాంకు సాధించాను. మంచి సర్వీస్ వచ్చినా, నేను తీసుకోలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మధ్యతరగతి,దిగువ మధ్యతరగతి వారిని ఐఏఎస్,ఐపీఎస్లుగా తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ లో ‘సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ’ ఏర్పాటు చేశాను. 

సివిల్స్ లో మీ శిక్షణ ఎలా ఉంటుంది ? 

సివిల్స్ ప్రిలిమ్స్ లో ఆబ్జెక్టివ్, మెయిన్స్ లో డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూలో వ్యక్తిత్వ పరీక్ష ఉంటుంది. ఈ మూడు దశల్లో ఒక్కో దానికి ఒక్కోరకమైన ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విధమైన ప్రణాళికతో ప్రిపేర్ కావాలి. ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసుకొని మేం చదివిస్తం. ప్రిలిమ్స్ పరీక్ష కోసం బేసిక్ కాన్సెప్ట్స్ నేర్పించడం, మెయిన్స్ కోసం రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం, ఇంటర్వ్యూ కోసం అద్దం ముందు ప్రాక్టీస్ చేయించడం వంటి యాక్టివిటీస్ ఉంటాయి. అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వాళ్లు వాడే మాటలను, పదజాలాన్ని సరిచేస్తాం. డిప్లొమాటిక్ గా మాట్లాడటాన్ని నేర్పిస్తాం. ఇంటర్వ్యూల్లో మాట్లాడే క్రమంలో చేసే తప్పులను సరిదిద్దుతాం. నిపుణులతో వివిధ అంశాలపై క్లాస్ లు చెప్పిస్తాం. బట్టీ పడితే కాదు.. కష్టపడితే తప్పక విజయం వరిస్తుంది. 

అభ్యర్థులను ఎలా ప్రోత్సహిస్తారు ? 

చాలామంది అభ్యర్థులు తొలి ప్రయత్నంలోనే పాస్ కారు. ప్రిలిమ్స్, మెయిన్స్.. ఏ స్టేజీలో పోయినా  మళ్లీ పరీక్ష రాయాలని అభ్యర్థులను ప్రోత్సహిస్తాం. మూడు దశల పరీక్షలతో కూడిన ‘సివిల్స్’ అనేది ఒక పెద్ద యజ్ఞం లాంటిది. కొందరు విద్యార్థులు మెయిన్స్ లో పోతే.. ఇంటర్వ్యూలో పోతే  మెంటల్ గా  చాలా డిప్రెస్ అవుతారు. అలాంటి వాళ్లకు ధైర్యం చెబుతాం. కౌన్సెలింగ్ చేస్తాం. పట్టు వదలకుండా.. సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు కృషి చేస్తే సివిల్స్ ర్యాంకు రావచ్చు. నేను మెంటర్ గానే కాకుండా.. విద్యార్థిగా, ఫ్రెండ్ గా అభ్యర్థులతో ఉంటాను. సలహాలు, సూచనలతో వారిని ముందుకు తీసుకెళ్తాను. 

సివిల్స్ హబ్ గా హైదరాబాద్ మారిందా ? 

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అభ్యర్థులు సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్తుంటారు. ఈ  ఒక్క కారణం వల్లే అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో పరిస్థితి మారింది. ఢిల్లీకి వెళ్లకుండానే.. హైదరాబాద్ లో కోచింగ్ తీసుకొని చాలామంది సివిల్స్ సాధిస్తున్నారు. ఇటీవల స్మరణ్ రాజ్ సాధించిన విజయమే ఇందుకు సాక్ష్యం. అక్షయ్ కుమార్ ఐపీఎస్ కూడా ఈవిషయంలో చాలా ఫేమస్. ఆయన కూడా ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకోకుండానే  సివిల్స్ లో విజయఢంకా మోగించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ ట్రెండ్ వల్లే..హైదరాబాద్ లోని మాలాంటి కోచింగ్ సెంటర్లకు ఆదరణ బాగా లభిస్తోంది. 

మీకు అంగ వైకల్యం అడ్డుగా అనిపించిందా ?

టెన్త్, ఇంటర్, డిగ్రీ, స్కూల్ డేస్ లో నాపై చిన్నచూపు ఉండేది. చుట్టుపక్కనున్న ఇతర విద్యార్థులతో పోల్చుకునే దాన్ని. దేవుడు నన్నే ఎందుకు ఇలా తయారు చేశాడు ? నేనే ఎందుకు  ఇలా ఉన్నాను ? అనే ప్రశ్నలో వెంటాడేవి. ఒక్కోసారి నేను ఒంటరిగా కూర్చొని  ఏడ్చేదాణ్ని. ఈక్రమంలోనే నేను నంబర్ 1 గా ఉండాలని డిసైడ్ అయ్యాను. భవిష్యత్తులో ఇతరులకు సాయం చేసే స్థితిలో ఉండాలని భావించాను. అందరూ నాపై జాలి చూపే స్థితి ఉండకూడదని అనుకున్నాను. ఈ స్థితిని అధిగమించాలనే ఏకైక ఉద్దేశంతోనే నేను సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాను. సివిల్స్ ను సాధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా.. ‘నేను నడవలేను’ అనే ఆలోచన రాలేదు.సివిల్స్ సాధించాక నా ఆత్మవిశ్వాసం పెరిగింది. వందలు, వేలమందిని సివిల్స్ విజయం దిశగా నడిపించగలననే  ఆత్మస్థైర్యం వచ్చింది. అదే స్ఫూర్తితో  గత 20 ఏళ్లుగా ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా సివిల్స్ కు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాను. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లను సివిల్స్ లోకి పంపడమే మా అకాడమీ లక్ష్యం. 

ఈతరంలో స్ఫూర్తిని నింపేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ? 

నేను స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి విద్యార్థులను మోటివేట్ చేస్తుంటాను. సివిల్స్ తో పాటు రకరకాల పోటీ పరీక్షల కోసం అభ్యర్థులకు గైడెన్స్ ఇస్తుంటాను. సివిల్స్ అనేది కోచింగ్ వల్ల రాదు. అభ్యర్థులు సమాజంపై అవగాహన పెంచుకోవాలి. ప్రతి టాపిక్ పై, విభిన్న అంశాలపై కూడా అవగాహన ఉండాలి. సివిల్స్ లో ప్రశ్నలు చాలా స్పాంటేనియస్ గా వస్తాయి. బ్రెయిన్ షార్ప్ నెస్ పెంచుకోవాలి.  ఇంటర్వ్యూ లో అడిగే ప్రశ్నలను చాలా వేగంగా అర్ధం చేసుకొని సమాధానాలు చెప్పగలగాలి. అందుకు ఒకటి, రెండేళ్ల శిక్షణ అవసరం.  

మరిన్ని వార్తలు..

TSPSC : పక్కా లోకల్​ ప్రియారిటీ

ఇవి బొమ్మల్లాంటి చాక్లెట్లు