
దేశంలోనే అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ లాంటి మొత్తం 24 కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు సివిల్స్ నోటిఫికేషన్‍ను 1056 పోస్టులతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వ శాఖల్లో పాలసీ మేకర్స్ గా మారి, ప్రజా సేవ చేసేందుకు ఆసక్తి ఉన్న యువతకు ఇదో మంచి అవకాశం. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులు. సివిల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, ప్రిపరేషన్ టిప్స్ తెలుసుకుందాం...
సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థుల వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, డిఫెన్స్ లో పనిచేసిన వారికి మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడంచెల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమ్స్: ఇందులో రెండు పేపర్లుంటాయి. జనరల్ స్టడీస్, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీ–శాట్). ఒక్కో పేపర్‌కు 200 మార్కులుంటాయి. పేపర్–1లో 100 ప్రశ్నలు, పేపర్–2లో 80 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్‌కు రెండు గంటల సమయం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.33 చొప్పున నెగెటివ్ మార్కులు ఉంటాయి. . పేపర్–1 జనరల్ స్టడీస్ లో ప్రతిభ చూపిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. పేపర్– 2 ఎలిజిబులిటి టెస్టు మాత్రమే.
మెయిన్స్: ఇందులో 9 పేపర్లుంటాయి. మొదటి విభాగంలో 300 మార్కుల చొప్పున పేపర్–ఎ (ఇండియన్ లాంగ్వేజ్), పేపర్–బి(ఇంగ్లీష్) ఉంటాయి. ఇవి కేవలం అర్హత పేపర్లు, కనీసం 75 మార్కులు సాధించాలి. అన్ని పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో రాయాల్సి ఉంటుంది. రెండో విభాగంలో మొత్తం ఏడు పేపర్లుంటాయి. ఇంటర్వ్యూ అర్హతకు మెయిన్స్‌లో పొందే మార్కులే కీలకం. జనరల్ ఎస్సే, నాలుగు జనరల్ స్టడీస్(జీఎస్) పేపర్లు, ఆప్షనల్ పేపర్లు రెండు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 250 మార్కుల చొప్పున మొత్తం 1750 మార్కులు ఉంటాయి. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో రాసే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూ: మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో పెట్టుకొని పోస్టుకు ఇద్దరు చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులుంటాయి. మెయిన్స్, ఇంటర్వ్యూకు కలిపి మొత్తం 2025 మార్కులు ఉంటాయి. ఈ మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
రైటింగ్ ప్రాక్టీస్‌తో విజయం: సివిల్స్ మెయిన్స్‌లో రైటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రిపరేషన్ మొదలుపెట్టిన నాటి నుంచే డిస్క్రిప్టివ్ అప్రోచ్ ఉన్న వారికి మెయిన్స్ పెద్దగా కష్టమనిపించదు. అభ్యర్థులు చాలా వరకు ఎస్సేను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాంతో ఈ పేపర్లో చాలా తక్కువ స్కోరుకు పరిమితమవుతున్నారు. కాబట్టి జనరల్ ఎస్సేపై స్పెషల్ ఫోకస్ చేయాలి. పరీక్ష రాసే క్రమంలో.. అనలిటికల్ అప్రోచ్‌తో రాసే సమాధానాలకు బలమైన కారణాలు ప్రస్తావిస్తూ.. విశ్లేషిస్తూ రాయాలి. వర్తమాన అంశాలను ఉదహరించడం వల్ల ఎక్కువ స్కోర్ చేయవచ్చు. నిరంతరం రైటింగ్ ప్రాక్టీస్‌తో ఒత్తిడిలోనైనా పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉండచ్చు.
కంబైన్డ్ ప్రిపరేషన్: సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటి నుంచే మెయిన్స్ కోణంలో ప్రిపరేషన్ కొనసాగించాలి. చాలా మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ సంగతి చూద్దాం అనే ధోరణిలో ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మొదటి నుంచే రెండింటికి కంబైన్డ్‌గా ప్రిపేర్ అవ్వాలి. మ్యాథ్స్ మీద పట్టులేని అభ్యర్థులు, తెలుగు మీడియం క్యాండిడేట్స్ సీశాట్‌పై ఫోకస్ చేయాలి.
ఆప్షనల్ సబ్జెక్ట్ కీలకం: ఆప్షనల్లో రెండు పేపర్లకు చాలా లోతైన ప్రిపరేషన్ అవసరం. అభ్యర్థులు సిద్ధం చేసుకున్న సొంత మెటీరియల్‌ను ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఏ చాప్టర్‌ను విస్మరించకూడదు. సిలబస్‌లో ఉన్న ప్రతి చాప్టర్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్టు ఏదైనప్పటికీ పీజీ స్థాయిలో ప్రిపరేషన్ ఉంటేనే మంచి మార్కులు సాధించవచ్చు.
సక్సెస్ స్ట్రాటజీ: సివిల్స్‌లో సక్సెస్ సాధించాలంటే ముందుగా సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. అన్ని టాపిక్స్ చదవకుండా కేవలం సిలబస్‌లో ఇచ్చిన అంశాల మీదే ఫోకస్ చేయాలి. 6 నుంచి12వ తరగతి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి. సరైన టైం టేబుల్‌తో ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి. ప్రిపరేషన్ సమయంలోనే ముఖ్యమైన అంశాలను నోట్స్ రాసుకుంటే రివిజన్ ఈజీగా ఉంటుంది. ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం, యోగా చేయడానికి కేటాయించాలి. నిద్రకు కూడా తగినంత సమయం ఇవ్వాలి. న్యూస్ పేపర్ క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్‌ను కరెంట్ టాపిక్కు అన్వయించుకుంటూ చదివితే మంచి ఫలితం ఉంటుంది. న్యూస్ ఛానల్స్‌లో వచ్చే ముఖ్యమైన డిబేట్స్ చూడాలి. ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత రివిజన్ చేయాలి. వీలైనంత ఎక్కువగా మాక్ టెస్టులు రాయాలి. దీంతో ఎక్కడ తప్పులు చేస్తున్నారో, ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారో అర్థం అవుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది కావున రోజూ కొంత సమయం రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ ఆన్సర్స్ రాయాల్సి ఉండడంతో స్పీడ్, అక్యూరసీకి ప్రాధాన్యం ఇవ్వాలి.
క్వాలిఫై పేపర్స్ మర్చిపోవద్దు: అర్హత పేపర్లు(ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్) మర్చిపోకుండా వాటికోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలి. టైమ్ మేనేజ్ చేసుకుంటూ అన్ని ప్రశ్నలకు ఆన్సర్ రాసేలా ప్రాక్టీస్ చేయాలి. ఇందుకోసం టెస్ట్ సిరీస్ ఎక్కువగా రాయాలి. దీంతో అభ్యర్థులు చేసే తప్పులు సరిచేసుకునే వీలు కలుగుతుంది. ప్రశ్నకు సరైన ఆన్సర్ సూటిగా రాయాలి స్పేస్ పరిమితంగా ఉంటుంది. జవాబులు పాయింట్స్, ఫ్లోచార్ట్ రూపంలో రాయాలి. జనరల్ స్టడీస్ లో ఎక్కువ మార్కులు పొందడానికి ఎన్సీఆర్టీ బుక్స్ ఎక్కువగా చదవాలి. ఇంటర్నెట్ ద్వారా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో చూడడం ద్వారా సబ్జెక్ట్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు.
రివిజన్తో టాప్ స్కోర్
చాలా మంది విద్యార్థులు కొత్త పుస్తకాలు కొని ఎక్కువగా చదవాలనే అపోహలో ఉంటారు. తక్కువ పుస్తకాలను ఎక్కువ సార్లు చదివి రివిజన్, మైండ్ మ్యాప్ చేసుకుంటే ఎగ్జామ్‌లో బాగా రాయవచ్చు. సిలబస్ లో ఉన్న అంశాలపై విద్యార్థికి పూర్తి అవగాహన ఉండాలి.
సర్వేలు, కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెట్టాలి
జనరల్ స్టడీస్‌లోని పేపర్-3 కోసం బడ్జెట్, ఆర్థిక సర్వేల మీద ఫోకస్ చేయాలి. ఇందులో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి అగ్రికల్చర్, భూ సంస్కరణలు, మౌలిక సదుపాయాల అంశాలపై అప్డేట్ అవ్వాలి. విపత్తు నిర్వహణ(డిజాస్టర్ మేనేజ్మెంట్) కోసం ఎన్డీఎమ్ఏ మీద నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అంతర్జాతీయ ఒప్పందాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రిపరేషన్ కొనసాగించాలి.
ఎస్సే, ఎథిక్స్, ఆప్షనల్స్‌పై స్పెషల్ ఫోకస్
మెయిన్స్ ఎగ్జామ్ మంచి మార్కులతో క్లియర్ చేయాలంటే ఎస్సే, ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్, ఆప్షనల్ సబ్జెక్ట్స్‌పై మంచి పట్టు సాధించాలి. వీటిలో మంచి మార్క్స్ వస్తే మెయిన్స్ ఈజీగా క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మెయిన్స్ 1750 మార్కుల్లో 1000 మార్కులు ఈ సబ్జెక్ట్స్ నుంచే వస్తున్నాయి. మిగిలిన 750 మార్కులు జనరల్ స్టడీస్‌కు కేటాయించారు. ప్రిలిమ్స్ కోసం ఖచ్చితంగా జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఇప్పుడు కొంతవరకు అది ప్లస్ అవుతుంది. ప్రిలిమ్స్‌లో లేని సిలబస్‌తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం న్యూస్ ఛానల్స్, పేపర్స్ చదవాలి
నోటిఫికేషన్
అర్హతలు: అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా అర్హులే. వయసు 21 నుంచి 32 మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్‌కు ఆరు, ఓబీసీలు, దివ్యాంగుల(జీఎల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ)కు తొమ్మిది సార్లు అవకాశం ఉంది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అపరిమితం.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్ మే 26న నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.upsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.