న్యూఢిల్లీ: సుప్రీంకేసులో ఏ కేసునైనా అత్యవసరంగా విచారించాలంటే ముందుగా రాతపూర్వకంగా లిస్ట్ చేయాల్సిందేనని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. ఓరల్‌గా చెప్పి కేసును అత్యవసరంగా విచారించాలని కోరే పద్ధతికి ఇకపై స్వస్తి పలుకుతున్నట్లు చెప్పారు. ఈమేరకు మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీజేఐ సంజీవ్ ఖన్నా మాట్లాడారు. " ఏ కేసునైనా మౌఖికంగా లిస్ట్ చేస్తే విచారించబోం. అత్యవసరంగా విచారించాలంటే దానికి కారణం తెలియజేస్తూ న్యాయవాదులు మెయిల్ లేదా లెటర్ ద్వారా ముందుగా లిస్ట్ చేయాల్సిందే. ప్రజాస్వామ్యంలో మూడో స్తంభమైన న్యాయవ్యవస్థకు నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. పేద, ధనిక సహా ఎలాంటి భేదాల్లేకుండా దేశంలోని పౌరులందరికీ న్యాయం సులభంగా దక్కేలా చూడడమే న్యాయవ్యవస్థ విధి" అని సీజేఐ జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు.