
ఏపీలో తాత్కాలిక హైకోర్ట్ ప్రారంభం అయ్యింది. రాజధాని అమరావతిలో జ్యుడీషియల్ కాంప్లెక్స్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రారంభించారు. ఆ తర్వాత హైకోర్టు శాశ్వత భవన సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు….ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు.
జ్యుడీషియల్ కాంప్లెక్స్ 8 ఎకరాల్లో 173 కోట్లతో కట్టింది ఏపీ సర్కార్. ఇందులో 23కోర్టు హాళ్లుంటాయి. శాశ్వత భవనం సిద్ధమై, హైకోర్టు అందులోకి తరలిపోయిన తర్వాత జ్యుడీషియల్ కాంప్లెక్స్ లో సిటీ సివిల్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. శాశ్వత హైకోర్టుకు పక్కనే, జడ్జిల నివాసాలకు దగ్గర్లో జ్యుడీషియల్ కాంప్లెక్స్ ను నిర్మించారు. జడ్జిలు, లాయర్లు, ప్రజలు, సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.