
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్) నియమితులు కానున్నారు. ఆయన 52వ సీజేఐగా మే 14న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13న ముగియనుంది.
ఈ నేపథ్యంలో తన తర్వాత సీనియర్ అయిన జస్టిస్ బీఆర్ గవాయ్‌ని సీజేఐగా నియమించాలని కేంద్రానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు బుధవారం లేఖ రాశారు. జస్టిస్ బీఆర్ గవాయ్ సీజేఐగా ఆరు నెలల పాటు సేవలందించనున్నారు. ఆయన ఈ ఏడాది నవంబర్ 23న రిటైర్ కానున్నారు. కాగా, సుప్రీంకోర్టు జడ్జీల రిటైర్‌మెంట్ వయసు 65 ఏండ్లు.
2003లో జడ్జిగా నియామకం..
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్) 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో పుట్టారు. లా పూర్తి చేసి 1985 మార్చి 16న బార్ అసోసియేషన్‌లో చేరారు. నాగపూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అమరావతి యూనివర్సిటీకి స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. 1992 నుంచి 1993 వరకు బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు.
2000 జనవరి 17న ఇక్కడే గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత 2005 నవంబర్ 12న పర్మనెంట్ జడ్జిగా ప్రమోషన్ పొందారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.
ఎన్నో కీలక తీర్పులు..
జస్టిస్ బీఆర్ గవాయ్ ఎన్నో కీలక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు, బెంచ్‌లలో ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం, నోట్ల రద్దు, ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన కీలక తీర్పుల్లో ఆయన భాగస్వాములు అయ్యారు.