ఆల్ ది బెస్ట్.. అతుల్ : ఐఐటీ అడ్మిషన్ ఖరారు చేస్తూ విషెస్ చెప్పిన సీజేఐ

ఆల్ ది బెస్ట్..  అతుల్ : ఐఐటీ అడ్మిషన్ ఖరారు చేస్తూ విషెస్ చెప్పిన సీజేఐ

న్యూఢిల్లీ: గడువులోగా అడ్మిషన్ ఫీజు కట్టలేక ఐఐటీ సీటు కోల్పోయిన పేద దళిత యువకుడి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాధిత విద్యార్థి అతుల్ కుమార్ కు అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్ బాద్ ను ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా తనకున్న విశిష్ట అధికారాలను ఉపయోగించి కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అతుల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ విచారణ చేపట్టి సోమవారం తీర్పు వెలువరించింది.

ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘అతుల్ లాంటి యువ ప్రతిభావంతుడిని చదువుకు దూరంచేస్తే చూస్తూ ఉండలేం. అతణ్ని అలా వదిలేయలేం. బాధిత విద్యార్థి పేద దళిత వర్గానికి చెందిన వ్యక్తి. అతడు అన్ని అడ్డంకులను దాటుకుని ఇక్కడిదాకా వచ్చాడు. అతుల్ సీటు సాధించిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (బీటెక్) కోర్సులోనే అతడికి అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్​బాద్​ను ఆదేశిస్తున్నాం” అని తెలిపింది. కాగా, తీర్పు తర్వాత ‘బాగా చదువుకో..’ అంటూ అతుల్ కుమార్​కు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

మూడు నెలల న్యాయ పోరాటం.. 

ఉత్తరప్రదేశ్ ముజఫర్​నగర్ జిల్లాలోని తితోరా గ్రామానికి చెందిన అతుల్ కుమార్​ది పేద దళిత కుటుంబం. అతని తండ్రి రోజువారీ కూలీ. కష్టపడి చదివిన అతుల్.. జేఈఈలో మంచి ర్యాంక్ సాధించి జార్ఖండ్​లోని ఐఐటీ ధన్​బాద్​లో సీటు సాధించాడు. అయితే, జూన్ 24 వరకు రూ.17,500 అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉండగా.. పేద కుటుంబం కావడంతో గడువులోగా అంత మొత్తం చెల్లించలేకపోయాడు. గ్రామస్తులను అడిగి జూన్ 24 సాయంత్రం వరకు రూ.17,500 సమకూర్చాడు. కానీ అతుల్ తన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసే సమయానికే ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. దీంతో ఐఐటీ ధన్ బాద్ అతనికి అడ్మిషన్ ఇవ్వలేదు.