
ఆసిఫాబాద్/మంచిర్యాల/ ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె ఉద్రిక్తంగా మారింది. గురువారం నాటికి సమ్మె 11వ రోజుకు చేరగా.. కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా ఆశావర్కర్లు, సీఐటీయూ నేతలు మెయిన్ గేట్ ముందు బైఠాయించి అధికారులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వీరిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సీఐటీయూ నేత ముంజం శ్రీనివాస్ తోపాటు మరికొందరిని పోలీసు వాహనంలో ఎక్కించగా.. ఆ వెహికల్ ముందుకు సాగకుండా ఆశా వర్కర్లు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చేతగాని ప్రభుత్వం తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించకుండా పోలీసులతో అణగదొక్కుతోందని మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్వంలో ఆశా వర్కర్లు మంచిర్యాల కలెక్టరేట్‌ను ముట్టడించారు. అదే సమయంలో బయటకు వస్తున్న అడిషనల్కలెక్టర్ బి.రాహుల్ కారును అడ్డుకున్నారు.
ఆయనకు తమ సమస్యలు విన్నవించి మెమోరాండం అందజేశారు. యూనియన్ నాయకులు సమ్మక్క, శోభ, సీఐటీయూ నాయకులు జి.ప్రకాశ్, రంజిత్,సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి పాల్గొన్నారు. ఆదిలాబాద్కలెక్టరేట్ముందు సైతం ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపై బైటాయించడంతో ధర్నా విరమించాలని పోలీసులు కోరగా.. కలెక్టర్వచ్చే వరకు తాము లేచేది లేదని వారు పట్టుబట్టారు. అడిషనల్కలెక్టర్ శ్యామలాదేవి అక్కడికి రావడంతో ఆమెకు వినతి పత్రం అందజేశారు.