- సీపీఐతో కలిసి కాంగ్రెస్ ముందుకు..కాంగ్రెస్‌కే టీజేఎస్, వైఎస్సార్టీపీ మద్దతు
- ఒంటరిగానే సీపీఎం.. జనసేనతో బీజేపీ
- జాతీయ పార్టీగా బీఆర్ఎస్కు తొలి పోటీ.. ఎంఐఎంతో ఫ్రెండ్లీగా బరిలోకి రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ పోటీ
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల పోటీ ముఖచిత్రం స్పష్టమైంది. తెలంగాణలో మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్... మళ్లీగెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉంది. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న తర్వాత బీఆర్ఎస్కు ఇదే తొలి పోటీ. కర్నాటకలో గెలిచిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. ఈసారి వినూత్నంగా అడుగులేస్తోంది. తెలంగాణ ఇచ్చిన తమకు ఒక అవకాశమివ్వాలంటూనే.. ఆరు గ్యారంటీలతో ఆ పార్టీ పోటీలో నిలిచింది. రెండేండ్లుగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్‌పెట్టిన బీజేపీ.. ఈసారి బీసీని సీఎం చేస్తామనే నినాదంతో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పొత్తుల తీరు కూడా మారింది. బీఆర్ఎస్, ఎంఐఎం ఫ్రెండ్లీగా బరిలోకి దిగాయి. ఎంఐఎంతో తమకు స్నేహపూర్వక పోటీ ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగానే ప్రకటించారు. గత ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్.. ఈసారి సీపీఐతో కలిసి పోటీ చేస్తున్నది. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించింది. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలనుకున్న సీపీఎం.. సీట్ల సర్దుబాటు కురదకపోవడంతో ఒంటరిగానే పోటీకి దిగింది. 19 చోట్ల తమ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. టీజేఎస్, వైఎస్సార్టీపీ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. కేసీఆర్సర్కారును ఓడగొట్టేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాయి. బీజేపీ ఈసారి జనసేనతో పొత్తు కుదుర్చుకుంది. 8 సీట్లను జనసేనకు కేటాయించింది. బీఎస్పీ ఈసారి రాష్ట్రమంతటా పోటీ చేస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ప్రవీణ్కుమార్సిర్పూర్నుంచి బరిలో నిలిచారు. ఎంఐఎం తమకున్న ఏడు సిట్టింగ్స్థానాలతో పాటు మొత్తం 9 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపింది.
బీఆర్ఎస్ లో 90 మంది సిట్టింగులకు టికెట్లు..
బీఆర్ఎస్119 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. వీరిలో 90 మంది సిట్టింగ్‌ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ తన సిట్టింగ్ స్థానం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. ఖానాపూర్, కోరుట్ల, ములుగు, అలంపూర్, మలక్‌పేట, కార్వాన్, చార్మినార్ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు చాన్స్ఇచ్చారు. ఉప్పల్, బోథ్ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులను పోటీకి దించారు. హుజూరాబాద్, కామారెడ్డి, జనగామ, నర్సాపూర్, గోషామహల్, వేములవాడ, మల్కాజిగిరి నియోజకవర్గాల్లోనూ కొత్త అభ్యర్థులను పోటీకి దించారు. వైరాలో మాజీ ఎమ్మెల్యేకు చాన్స్ఇచ్చారు. భద్రాచలం, మధిర, నాంపల్లి, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, మంథని, సంగారెడ్డి నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకే మళ్లీ అవకాశం ఇచ్చారు.
ఓడిపోయినోళ్లకు కాంగ్రెస్ లో మళ్లీ చాన్స్..
కాంగ్రెస్ఈసారి 118 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. వీరిలో ముగ్గురు ఎంపీలు, ఆరుగురు సిట్టింగ్ఎమ్మెల్యేలుండగా.. 30 మంది ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లు ఉన్నా రు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి న 48 మంది అభ్యర్థులకు కాంగ్రెస్ఈసారి మళ్లీ అవకాశమిచ్చింది. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఈసారి రెండు చోట్ల పోటీకి దిగు తున్నారు. కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీ పడుతున్నారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీ బరిలో నిలిచారు. సీనియర్ లీడర్లు జానారెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండి తమ వారసులను పోటీకి దింపారు.
పాత, కొత్త లీడర్లతో బీజేపీలో సర్దుబాటు
గత అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. ఈసారి జనసేనతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీకి ఎనిమిది స్థానాలు ఇచ్చింది. మిగతా 111 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎంపీలు బండి సంజయ్(కరీంనగర్), ధర్మపురి అర్వింద్(కోరుట్ల), సోయం బాపురావు (బోథ్) అసెంబ్లీ బరిలో నిలిచారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తన సొంత సెగ్మెంట్ తో పాటు సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ లో పోటీ చేస్తున్నారు. గోషామహల్ నుంచి రాజాసింగ్ మరోసారి పోటీకి దిగుతున్నారు. దుబ్బాక నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్న నేతలు 20 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 22 మంది అభ్యర్థులకు మళ్లీ టికెట్లు ఇచ్చారు. మిగతా స్థానాల్లో కొత్త అభ్యర్థులను పోటీకి దించారు. బీజేపీ స్టేట్చీఫ్ కిషన్‌రెడ్డి ఈసారి అసెంబ్లీ పోటీకి దూరంగా ఉన్నారు.
ALSO READ: కరీంనగర్: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ