హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. కొత్త పోస్టులకు సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి పూర్తిస్థాయి సమాచారం లేకపోవడం వల్లే నోటిఫికేషన్ ఆలస్యం అవుతోందని టీఎస్పీఎస్సీ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 503 గ్రూప్–1 పోస్టులకు సర్కారు ఆమోదం తెలపగా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 19 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్టు సర్కారు వెల్లడించింది. అయితే రెండు, మూడు డిపార్ట్మెంట్లలో భర్తీచేసే కొన్ని పోస్టులు ఇదివరకు లేవు. ఈసారి కొత్తగా ప్రభుత్వం వాటిని క్రియేట్ చేసి, భర్తీ చేయబోతుంది. కొత్త పోస్టులు కావడంతో వాటికి ఆయా డిపార్ట్మెంట్లు ముందుగా అధికారిక జీవోలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. అధికారికంగా జీవోలు వచ్చిన తర్వాతే వాటిని భర్తీ చేసేందుకు అవకాశముందని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
ఇయ్యాల టీఎస్పీఎస్సీ మీటింగ్
టీఎస్పీఎస్సీ పూర్తిస్థాయి కమిటీ సమావేశం శనివారం మధ్యాహ్నం జరగనున్నది. ఇందులో గ్రూప్–1 నోటిఫికేషన్, పలు న్యాయపరమైన అంశాలపై చర్చించనున్నారు. అయితే ఇది రెగ్యులర్ సమావేశమేనని, దీనికి పెద్దగా ప్రాధాన్యతేమీ లేదని టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.