ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ మీటింగ్​లో లొల్లి

  • ఉద్యమకారులను అణగదొక్కుతున్నారని మధిర నేత ఆందోళన  
  • దొంగలను తరిమికొట్టాలని ప్రకటన 
  • గులాబీ పార్టీలో బయటపడ్డ విభేదాలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్​ సమావేశం సందర్భంగా ఆ పార్టీలోని వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వీవీసీ ఫంక్షన్ హాల్​లో బీఆర్ఎస్ ​ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుండగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్​పై ఆ పార్టీకి చెందిన మధిర నియోజకవర్గ నేత, ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి విమర్శలు చేశారు. ఉద్యమకారులను అణగదొక్కుతున్న దొంగలను పార్టీ నుంచి తరిమికొట్టాలన్నారు. ఉద్యమ సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి, కేసులు ఎదుర్కొన్న తనను ఎన్నోసార్లు అవమానించారని మండిపడ్డారు. 

స్టేజీ మీదకు పిలవకపోవడంతో రామ్మూర్తి హల్ చల్ చేశారు. దీంతో స్టేజీపై ఉన్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సర్దిచెప్పగా, మాజీ ఎమ్మెల్యే మదన్​లాల్​ వచ్చి రామ్మూర్తిని పైకి తీసుకెళ్లారు. కమ్యూనికేషన్​ గ్యాప్​ వల్లే స్టేజీ మీదకు పిలవలేదని ఎంపీ రవిచంద్ర సముదాయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బీఆర్​ఎస్​ ముఖ్య నేతలు మాట్లాడుతూ ఖమ్మం నుంచి బీఆర్ఎస్​అభ్యర్థి, ఎంపీ నామ నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నామతో పాటు మాజీ మంత్రి అజయ్, తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, చంద్రావతి, మెచ్చా నాగేశ్వరరరావు, తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, మాజీ డీసీసీబీ చైర్మన్​ నాగభూషయ్య పాల్గొన్నారు.