అంగన్​వాడీ వర్కర్లు, పోలీసుల మధ్య ఘర్షణ

నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. అంగన్​వాడీ టీచర్లు, పోలీసుల మధ్య ఘర్షణ జరగింది. నారాయణపేటకు శనివారం హోం మంత్రి రాగా, మంత్రిని కలిసేందుకు అంగన్​వాడీ, ఆశా కార్యకర్తలను పోలీసులు అనుమతించలేదు. దీనిని నిరసిస్తూ ఆదివారం అంగన్​వాడీ కార్యకర్తలు సత్యనారాయణ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.దీంతో ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.

ట్రాఫిక్​లో అడిషనల్​ కలెక్టర్​ వాహనం కూడా ఇరుక్కుంది. మిలాద్​ ఉన్​ నబీ ర్యాలీ బందోబస్తులో ఉన్న పోలీసులకు అడిషనల్​ కలెక్టర్​ ఫోన్​ చేసి ట్రాఫిక్​పై సమాచారం ఇచ్చారు. డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని రాస్తారోకో విరమించాలని సూచించారు. దీనికి సీఐటీయూ నాయకులు, అంగన్​వాడీ కార్యకర్తలు ఒప్పుకోకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో సీఐటీయూ నేత బలరాంను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా, టీచర్లు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సీఐ చేతికి గాయమై రక్తం కారగా, డీఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే సీఐటీయూ నేత బలరాం అస్వస్థతకు గురయ్యాడు. విధులను అడ్డుకోవటంతో పాటు తమను గాయపర్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్పగా, తమ నాయకుడిపై పోలీసులు దాడి చేసి కొట్టారని సీపీఎం, అంగన్​వాడీ టీచర్లు ఆరోపించారు.