నాగర్ కర్నూల్ జిల్లా: కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామం పరిధిలోని కృష్ణా నదిలో రెండు రాష్ట్రాల బోటు నిర్వాహకుల మధ్య వివాదం ఏర్పడింది. సంగమేశ్వర ఆలయానికి పర్యాటకుల తరలింపుపై ఏపీ, తెలంగాణ బోట్ల నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు.
దాదాపు 40 ఏళ్ల నుంచి సోమశిలకు చెందిన రెండు వందల కుటుంబాలు సంగమేశ్వరానికి బోట్లలో పర్యాటకులను చేరవేస్తూ జీవనం సాగిస్తున్నాయి. కృష్ణా నదికి ఆవలి ఒడ్డును ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిధిలోని సిద్దేశ్వరం గ్రామానికి చెందిన బోటు నిర్వాహకులు సోమశిల బోటు నిర్వాహకులను సంగమేశ్వర ఆలయానికి రాకుండా అడ్డుకున్నారు. పర్యాటకులతో సంగమేశ్వరం వచ్చిన సోమశిల బోటును సిద్దేశ్వరం బోటు నిర్వాహకులు లాక్కెళ్లిపోయారు. దీంతో సోమశిల బోటు నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు.