ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ పాటించడంలేదని బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. గురువారం పెర్కిట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి జూపల్లి రాకముందు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అక్కడికి వచ్చారు. కొనుగోలుకు కేంద్రానికి సంబంధించి ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ప్రొటోకాల్ పాటించలేదని, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి ఫొటోలు ఎందుకు వేయలేదని బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.
దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు వారు చించేశారు. దీంతో గొడవ మరింత ముదరింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురిని సముదాయించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు.