పసునూరులో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ

మునుగోడు నియోజకవర్గంలో పాలిటిక్స్ రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా నాంపల్లి మండలంలోని పసునూరులో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పసునూరు గ్రామానికి టీఆర్ఎస్ ఇంచార్జ్గా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. అయితే ఈ గ్రామంలో బీజేపీ  ర్యాలీ తీస్తుండగా టీఆర్ఎస్ కవ్వింపులకు పాల్పడిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అటు టీఆర్ఎస్ కు డిజే పర్మీషన్ ఎవరు ఇచ్చారని పోలీసులను బీజేపీ కార్యకర్తలు నిలదీశారు. 

మరోవైపు మునుగోడు బై పోల్ ప్రచారం ఆఖరి ఘట్టానికి చేరుకుంది. నవంబర్ 1 సాయంత్రం 3 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు హోరాహోరీగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక సీఎం చండూరు సభతో... గులాబీ క్యాడర్లో జోష్ వచ్చింది. ఇవాళ బైక్ ర్యాలీలకు ప్లాన్ చేసింది బీజేపీ. ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు హస్తం లీడర్లు. ఇవాళ, రేపు సాధ్యమైనంత వరకు నేరుగా ఓటర్లను కలిసేందుకు ప్లాన్ చేసుకున్నారు నేతలు. పార్టీల ప్రలోభాలపై ఈసీ స్పెషల్ ఫోకస్ చేసింది. సోదాలు, తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక ప్రచారం ముగుస్తుండడంతో ఆఖరి యత్నాలపై నజర్ పెట్టారు అభ్యర్థులు.