నల్గొండ జిల్లా నాంపల్లిలో బీజేపీ - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తుంగపాడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రసంగిస్తుండగా.. పక్కనే ఉన్న వినాయక మండపం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి సౌండ్తో రేవంత్ రెడ్డి సాంగ్ పెట్టారు. సౌండ్ తగ్గించాలని బీజేపీ కార్యకర్తలు కోరగా.. కాంగ్రెస్ కార్యకర్తలు ససేమిరా అనడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకోగా.. స్థానికులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు.
మునుగోడు ఉపఎన్నికను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ తరుపున రాజగోపాల్ రెడ్డి బరిలో నిలుస్తుండగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థి వేటలో ఉన్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మళ్లీ గెలిచి తన సత్తా చూపాలని రాజగోపాల్ రెడ్డి.. రాష్ట్రంలో తమకు ఎదురులేదని నిరూపించాలని టీఆర్ఎస్ భావిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మరంగా పర్యటిస్తున్నారు. అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా ప్రజల్లో ఉండేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి.