జైనూర్‌‌‌‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

  •     ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

జైనూర్, వెలుగు : ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో సోమవారం జరిగింది. మండల కేంద్రంలో మెయిన్‌‌‌‌ రోడ్డుపై ఓ వర్గానికి చెందిన యువకుడితో మరో వర్గం యువకుడు గొడవ పడి ఒకరినొకరు కొట్టుకున్నారు. 

విషయం తెలుసుకున్న ఇరువర్గాలకు చెందిన యువకులు అక్కడికి చేరుకోవడంతో వివాదం మరింత ముదిరింది. రాళ్లు, కర్రలతో దాడికి ప్రయత్నించడంతో రోడ్డుపై ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో బైమెతుల గంగారాం, నాగారగొజె పరుశురాం, మర్సకోల లక్ష్మణ్‌‌‌‌కు గాయాలయ్యాయి. ఆదివాసీ యువకుడు లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో జైనూర్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందించిన డాక్టర్లు ఆదిలాబాద్ రిమ్స్‌‌‌‌కు తరలించారు. 

దీంతో పోలీసులు మండల కేంద్రంలో 144 సెక్షన్‌‌‌‌ విధించి పోలీస్‌‌‌‌ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మార్కెట్‌‌‌‌లోని షాపులను క్లోజ్ చేయించారు. ఆదివాసీ యువకునిపై దాడి గురించి ఆదివాసీ సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సై సందీప్‌‌‌‌కుమార్‌‌‌‌ మాట్లాడుతూ ఘర్షణకు కారణమైన వారిపై కేసు నమోదు చేస్తామని, విచారణకు ఇరువర్గాలు సహకరించాలని కోరారు.