- సభ నుంచి కౌన్సిలర్ల వాకౌట్
- చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్‌కు వినతి
జడ్చర్ల టౌన్, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాల్టీలో చైర్ పర్సన్, కౌన్సిలర్ల మధ్య కొంత కాలంగా విభేదాలున్నాయి. తాజాగా మున్సిపల్ సభలోనూ ఈ విబేధాలు బయటపడ్డాయి. ఈసారి ఏకంగా సభ్యులు చైర్ పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్‌కు కలవడం హాట్ టాపిక్‌గా మారింది. శనివారం జడ్చర్ల మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం ప్రారంభం నుంచే చైర్పర్సన్ లక్ష్మి, కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది.
సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేక, కొద్దిసేపు అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. దీంతో అసహనానికి గురైన కౌన్సిలర్లు ఆమెపై ఫైర్ అయ్యారు. సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించకుండా బయటకు వెళ్లి రావడంపై తప్పుబట్టారు. దీంతో వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి సభ్యులు బయటకు వచ్చారు. మున్సిపల్ ఆఫీస్ ఎదుట సమావేశం ఎజెండా కాపీలను చింపేసి నిరసన తెలిపారు. అనంతరం సభ్యులంతా కలిసి మహబూబ్‌నగర్‌కు వెళ్లి కలెక్టర్‌ను కలిసి చైర్ పర్సన్‌పై అవిశ్వాసం పెడుతున్నట్లు కటెక్టర్కు వినతిపత్రం అందించారు.
కమిషనర్ కు కౌన్సిల్ మీటింగ్ పట్టదా?
గద్వాల: కౌన్సిల్ మీటింగ్ అంటే మున్సిపల్ కమిషనర్ కు పట్టదా? మీటింగ్ ఉన్నప్పుడు సెలవుపై ఎలా వెళ్తారని, ఆయనకు సెలవు ఎవరిచ్చారని మున్సిపల్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గద్వాల మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్ చైర్మన్ బీఎస్ కేశవ్ అధ్యక్షతన నిర్వహించారు. మీటింగ్ కు కమిషనర్ హాజరు కాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ను ఏడాది పాటు కొనసాగించాలని, చెత్త సేకరణ ఏజెన్సీ రద్దుచేసి పాత పద్ధతితో సేకరించాలని తీర్మానించారు.
మున్సిపల్ టీపీవోను సరెండర్ చేయాలి
వనపర్తి: వనపర్తి మున్సిపాలిటీలో పని చేసే టీపీవో డ్యూటీ సక్రమంగా నిర్వర్తించడం లేదని, టౌన్ ప్లానింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, ఫోన్ చేసినా స్పందించడం లేదని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని సభ్యులు డిమాండు చేశారు. అతడిని సరెండర్ చేయాలని తీర్మానించారు. చైర్మన్ పుట్టపాక మహేశ్ అధ్యక్షతన వనపర్తి మున్సిపాలిటీ సమావేశం నిర్వహించారు. పట్టణ శివారులోని నాగవరం వద్ద రిజిస్ట్రేషన్ ఆఫీస్ పనులను ఆపాలని కోరారు. పట్టణంలో కుక్కల బెడద నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. వైస్ చైర్మన్ పి కృష్ణ, కమిషనర్ పూర్ణచందర్రావు పాల్గొన్నారు.
పార్టీలకతీతంగా అభివృద్ది చేద్దాం
పాలమూరు: పార్టీలకతీతంగా పట్టణాన్ని అభివృద్ది చేద్దామని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. వార్డుల్లో డ్రైనేజీ, కుక్కల బెడద, స్ట్రీట్ లైట్ల సమస్య ఉందని సమావేశంలో ప్రస్తావించారు. పట్టణ అభివృద్దికి కృషి చేస్తామని, సీఎం, ఎమ్మెల్యేల సహకారం తీసుకుంటామని చెప్పారు. వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.