గెట్టు పంచాది.. గొడ్డలితో పాలోళ్లపై దాడి

గెట్టు పంచాది.. గొడ్డలితో పాలోళ్లపై దాడి
  • నలుగురికి తీవ్ర గాయాలు.. ఒకరి కండిషన్​ సీరియస్​
  • దాడిచేసిన వ్యక్తులు పరార్​.. గాలిస్తున్న పోలీసులు
  • నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో ఘటన

నల్గొండ అర్బన్, వెలుగు: భూవివాదంలో అన్నదమ్ముల పిల్లలు గొడ్డలితో నరుక్కున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి సీరియస్​గా ఉన్నది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఈ ఘటన  మంగళవారం జరిగింది. గ్రామంలో గత కొన్నేండ్లుగా సర్వే నంబర్ 155 కు సంబంధించి భూ తగాదాలు నడుస్తున్నాయి.అన్నదమ్ముల  మధ్య పోలీస్ స్టేషన్​తోపాటు కోర్టులో ఈ భూమిపై కేసులు నడుస్తున్నాయి. దీనిపై కక్ష పెంచుకున్న గజ్జి లింగయ్య కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం తమ వ్యవసాయ బావి వద్ద  గజ్జి చంద్రయ్య కుటుంబ సభ్యులు వరాలు తీస్తున్న సమయంలో ఘర్షణకు దిగారు.

గజ్జి లింగయ్య కొడుకు గణేశ్, శంకర్, సందీప్ కలిసి గజ్జి చంద్రయ్య కొడుకులైన గజ్జి శంకర్, సైదులు, రామలింగం, చంద్రయ్య భార్య సత్యమ్మపై గొడ్డలితో  దాడి చేశారు. దీంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తల మీద బలమైన దెబ్బలు తగలడంతో గజ్జి చంద్రయ్య భార్య సత్యమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆమెను  జిల్లా కేంద్రంలోని  ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు.

గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు తిప్పర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గజ్జి చంద్రయ్య కుమారుడు గజ్జి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తిప్పర్తి ఎస్సై సాయి ప్రకాశ్​ తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులు సంఘటనా స్థలం నుంచి పరారైనట్టు సమాచారం. దాడికి పాల్పడిన గజ్జి లింగయ్య కుటుంబ సభ్యుల పైన హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.