కామరెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన డీఎస్పీపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు మృతదేహం తరలింపు విషయంలో డీఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శించారని రైతులు మండిపడ్డారు. డీఎస్పీ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్ లోకి నలుగురిని మాత్రమే అనుమతిస్తామని ఏఎస్పీ చెప్పడంతో అన్నదాతలు ఆగ్రహంతో రగిలిపోయారు. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను ఎత్తి పడేసిన రైతులు పోలీసులను తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.
అంతకుముందు... కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు మద్దతు తెలిపారు. కలెక్టర్ వచ్చి మెమోరాండం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. పోలీసులకు సహకరిస్తామని, అత్యుత్సాహం ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. బుధవారం శవాన్ని అడ్డుకున్నట్టు ఇవాళ ఉండదని డీఎస్పీని హెచ్చరించారు. మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా భూమి కోల్పోతామన్న భయంతో ఆత్మహత్య చేసుకున్న.. రాములు మృతికి సంతాపంగా రైతులు మౌనం పాటిస్తుండగా అక్కడికి వచ్చిన సర్పంచ్ భర్త జనార్దన్ రెడ్డిపై వారు దాడికి యత్నించారు. రాజీనామా చేయకుండా ర్యాలీ వద్దకు ఎందుకు వచ్చావంటూ నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను సముదాయించారు.