లింగంపేట, వెలుగు : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్దగుజ్జుల్ తండాలో మద్యం మత్తులో కొడుకును కత్తితో పొడిచిన ఓ తండ్రి తర్వాత గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండావాసులు, పోలీసుల కథనం ప్రకారం..తండాకు చెందిన బదావత్వసంత్రావు(45)కు సరస్వతి, నీల భార్యలు. వీరిలో చిన్న భార్య నీల చనిపోయింది. పెద్ద భార్య సరస్వతి కొడుకు సురేశ్(22)కొన్నేండ్ల కింద దుబాయ్ వెళ్లాడు. అక్కడ సంపాదించిన డబ్బును ప్రతి నెలా తండ్రికి పంపేవాడు. నెల కింద దుబాయ్నుంచి వచ్చిన సురేశ్ కొద్ది రోజులుగా తాను పంపిన డబ్బుల గురించి అడుగుతున్నాడు.
దీనికి వసంత్‌రావు రేపు మాపు ఇస్తా అంటూ కాలయాపన చేస్తున్నాడు. బుధవారం రాత్రి డబ్బుల విషయంలో తండ్రితో సురేశ్ గొడవపడ్డాడు. ఖచ్చితంగా డబ్బులు కావాలని పట్టుబట్టడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న తండ్రి క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి పొడిచాడు. సురేశ్అక్కడికక్కడే చనిపోయాడు. కొద్దిసేపటికే వసంత్‌రావు గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తండావాసులు పోలీసులకు సమాచారమివ్వగా ఎస్ఐ ప్రేమ్‌దీప్ సిబ్బందితో వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న వసంత్‌రావును నిజామాబాద్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే ట్రీట్‌మెంట్‌తీసుకుంటూ గురువారం చనిపోయాడు. వసంత్‌రావు భార్య సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామన్ తెలిపారు.