జగిత్యాల జిల్లాలో ఎస్సారెస్పీ ల్యాండ్ కోసం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. మెట్ పల్లి మండలం రామారావుపల్లికి గ్రామపంచాయతీ భవనం, క్రీడా మైదానాన్ని ఎస్సారెస్పీ స్థలంలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. గ్రామ శివారులోని ఎస్సారెస్పీ ల్యాండ్ లో వీటిని ఏర్పాటు చేసేందుకు గ్రామ కమిటీ, గ్రామ పంచాయతీ కూడా తీర్మానించింది.
అయితే.. గ్రామ శివారులో ఉన్న భూమిలో పంటలు పండించుకునే వారంతా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ భూమిలోనే పంటలు పండించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ భూమిని గ్రామ కమిటీ బలవంతంగా లాక్కుంటోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ లక్ష్మి భర్త రమేష్ కావాలనే తమ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామ కమిటీ సభ్యులకు, ఎస్సారెస్పీ స్థలంలో పంటలు పండించుకునే వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానిక ఆసుత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇరు వర్గాల మధ్య గొడవను ఆపే ప్రయత్నం చేశారు.