సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మండలం యార్కారంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గానికి చెందిన వ్యక్తుల ఇండ్లపై దాడి చేశారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తిరుమలగిరికి చెందిన తాడోజు శ్రీకాంత్‌రాజుకు యర్కారం గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డె ఎల్లయ్య మధ్య పాత కక్షలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఎల్లయ్యను సెటిల్‌మెంట్ పేరుతో గత నెల 18న జగ్గయ్యపేటకు పిలిపించారు. అక్కడ ఎల్లయ్యను కిడ్నాప్ చేసి, హత్య చేసిన అనంతరం డెడ్‌బాడీని విశాఖపట్నం తీసుకెళ్లి సముద్రంలో పడేశారు. జగ్గయ్యపేట, సూర్యాపేట పోలీస్‌స్టేషన్లలో కేసు నమోదు కావడంతో నాలుగు రోజుల క్రితం శ్రీకాంత్‌రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్లయ్య డెడ్‌బాడీ కోసం గాలించినా దొరకలేదు. దీంతో ఈ నెల 5న గ్రామంలో ఎల్లయ్య సంతాపసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఎల్లయ్య వర్గీయులు గ్రామంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇదే టైంలో గతంలో ఎల్లయ్యపై దాడి చేసిన వ్యక్తులు ఎదురుపడ్డారు. దీంతో శ్రీకాంత్ రాజుతో కలిసి ఎల్లయ్యను హత్య చేశారంటూ ఆరోపణలు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం అర్ధరాత్రి ఎల్లయ్య వర్గీయులు అదే గ్రామానికి చెందిన 8 మంది ఇండ్లపై దాడి చేసి ఫర్నిచర్, వెహికల్స్ ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పికెటింగ్ ఏర్పాటు చేశారు. దాడిలో పాల్గొన్న 27 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తెలిపారు.