కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. గత రాత్రి మెటలర్జీ ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి పై ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు దాడికి పాల్పడ్డారంటూ మిగితా సంఘాలు జేఎన్టీయూ జేఏసీగా ఏర్పడి గురువారం ఆందోళనకు దిగాయి. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీనిపై వీసీకి కూడా ఫిర్యాదు చేయబోతున్న జేఎన్టీయూ జేఏసీ విద్యార్థులకు.. ఏబీవీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో జేఎన్టీయూ జేఏసీ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్రమయ్యే పరిస్థితులు కనిపించాయి. పలువురు ఏబీవీపీ విద్యార్థులు వీసీ భవనంలోకి చొచ్చుకు వెళ్లి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.