జగిత్యాల జిల్లాలో రెండు గ్రామాల మధ్య ఉపాధి హామీ చిచ్చురేగింది. చర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు పనులకు వెళ్తుండగా.. గుల్లకోట సర్పంచ్ భర్త, గ్రామస్తులు కలిసి వారిని అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామాల మధ్య హద్దులు చూపెట్టకపోవడంతో ఇరు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో రెండు గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. ఒకరిని ఒకరు చొక్కా పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడికి చేరుకున్న రెండు గ్రామాల పంచాయితీ రాజ్, రెవిన్యూ అధికారులు.. గొడవను ఆపారు.
గతంలో రెండు గ్రామాలు ఒకే గ్రామ పంచాయితీ కింద ఉండేవి. జిల్లాల విభజన అనంతరం కొత్త గ్రామ పంచాయతీలుగా గుల్లకోట, చర్లపల్లి గ్రామాలు మారాయి. కొన్ని సంవత్సరాలుగా చర్లపల్లి ఉపాధి హామీ కూలీలు ఉపాధి పని కోసం గుల్లకోట గ్రామంలోని ఎక్కాలగుట్టకు వెళ్లేవారు. దీంతో ఇక నుంచి మా గ్రామానికి ఉపాధి హామీ కూలీలు రావద్దని డిమాండ్ చేశారు.