భూవివాదం..కర్రలు,కొడవళ్లతో దాడులు

భూవివాదం..కర్రలు,కొడవళ్లతో దాడులు
  • పలువురికి గాయాలు
  • పరిగి దవాఖానకు తరలింపు

పరిగి, వెలుగు: భూ తగాదాలతో ఒకరిపై ఒకరు కర్రలు, కొడవళ్లతో దాడులు చేసుకోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలోని  2.12 ఎకరాలను బండి మనోజ్, బండి నరసింహులు 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు.  అదే గ్రామానికి చెందిన చాపల రాములు ఇందులో తన భూమి ఉందని కోర్టును ఆశ్రయించారు.

సర్వే పూర్తయ్యేవరకు పొలాన్ని ఎవరూ సాగు చేయొద్దని రెవెన్యూ అధికారులు నిబంధనలు విధించారు.  తనకు అనుకూలంగా పేపర్లు ఉన్నాయని చాపల రాములు ఆదివారం ఉదయం తన కుటుంబసభ్యులైన అంజిలయ్య, లక్ష్మి, మానస, నరసింహులుతో కలిసి విత్తనాలు వేసేందుకు ఆ పొలంలోకి వెళ్లాడు.

విషయం తెలుసుకున్న బండి మనోజ్ కుటుంబసభ్యులు విత్తనాలు వేయనీయకుండా అడ్డుకునే యత్నం చేశారు. ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది.  ఒకరిపై ఒకరు కర్రలు కొడవళ్లతో దాడి  చేసుకున్నారు.

తీవ్రంగా గాయపడిన బండి మనోజ్ కుటుంబసభ్యులు శాంతమ్మ, నర్సింహులు, లక్ష్మిలను పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మనోజ్ ఫిర్యాదు మేరకు దోమ ఎస్ఐ ఆనంద్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.