ఆషాఢంలోనూ  రిజిస్ట్రేషన్లు అదుర్స్ .. జోరుగా ల్యాండ్​ రిజిస్ట్రేషన్లు

ఆషాఢంలోనూ  రిజిస్ట్రేషన్లు అదుర్స్ .. జోరుగా ల్యాండ్​ రిజిస్ట్రేషన్లు
  • భూముల మార్కెట్ వాల్యూ పెరగనున్న నేపథ్యంలో  రిజిస్ట్రేషన్ ఆఫీసులకు తాకిడి
  • బుధవారం ఒక్కరోజే 9,618 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్​ 
  • 115.37 కోట్ల రికార్డు ఆదాయం 
  •  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు  రెండు రోజుల్లో రూ.100 కోట్ల చొప్పున ఆదాయం 
  • 1400 కోట్లు దాటిన జులై రాబడి 
  • ఇదే స్థాయిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయ భూములు, నాన్ అగ్రికల్చరల్ ప్లాట్ల మార్కెట్ వాల్యూస్ ఆగస్టు ఫస్ట్ నుంచి పెరగబోతున్నాయనే ప్రచారంతో రాష్ట్రవ్యాప్తంగా  భూముల రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. బుధవారం 9,618 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కాగా రికార్డు స్థాయిలో రూ.115.37 కోట్ల ఆదాయం వచ్చింది గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆషాఢ మాసంలోనూ రిజిస్ట్రేషన్లు భారీగా నమోదయ్యాయి. మంగళ, బుధవారాల్లో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.100 కోట్ల చొప్పున వచ్చింది.

మార్కెట్ వాల్యూ పెరగకముందే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునేందుకు కొనుగోలుదారులు ఇంట్రెస్ట్ చూపారు. దీంతో సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ ఆఫీసులకు ప్లాట్లు, వ్యవసాయ భూముల అమ్మకందారులు, కొనుగోలుదారుల తాకిడి పెరిగింది. ప్లాట్లు, భూములు, ఇండ్లు కొనుగోలుకు అడ్వాన్స్ చెల్లించి.. రెండు, మూడు నెలల వాయిదాతో అగ్రిమెంట్ రాసుకున్నోళ్లు కూడా ముందే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు భారం తగ్గించుకునేందుకు జులై 31లోగా రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా స్టాంప్ డ్యూటీ కట్టేశారు. 

రెండు రోజులు రూ.100 కోట్లు దాటిన ఆదాయం..

సాధారణ రోజుల్లో రెగ్యులర్ గా రోజుకు రూ.45 కోట్ల మేర ఆదాయం వస్తుండగా కొద్ది రోజులుగా రూ.80 కోట్లు దాటుతోంది. సాధారణంగా ఆషాఢ మాసంలో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతాయి. కానీ, మంగళవారం ఒక్క రోజే 8,235 రిజిస్ట్రేషన్లు కాగా రూ.86 కోట్లు ఆదాయం రాగా, బుధవారం 9,618 రిజిస్ట్రేషన్లకు రూ.115.37 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే, ఈ రిజిస్ర్టేషన్లతో సహా ఆఫ్ లైన్, ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించిన ఈ–-స్టాంప్స్ ద్వారా వచ్చిన రాబడి మంగళవారం రూ.102 కోట్లు దాటగా.. బుధవారం రూ.70 కోట్ల వరకు వచ్చింది.  

మొత్తంగా జూలై నెలలో ఈ –- స్టాంప్స్, ఈసీల జారీ, ఫ్రాంకింగ్ మిషన్, సర్టిఫైడ్ కాపీల జారీ ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.1417 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో కలిపి రూ.4,311 కోట్ల ఆదాయం సమకూరింది. ధరణి ద్వారా నెలకు సగటున రూ.150 కోట్ల చొప్పున నాలుగు నెలల్లో మరో రూ.600 కోట్ల ఆదాయం సమకూరిందని అంచనా. ధరణిలో రోజూ 3 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు, ముట్యేషన్లు, 350కిపైగా నాలా కన్వర్షన్లు జరుగుతున్నాయి. 

గత సర్కార్ హయాంలో రెండు సార్లు పెంపు 

గత సర్కార్ హయాంలో రాష్ట్రంలో రెండు సార్లు భూముల విలువను పెంచారు. 2021 జులై 22న మొదటిసారిగా భూములు, భవనాల మార్కెట్‌వాల్యూ పెంచింది. ఎలాంటి కసరత్తు చేయకుండానే అప్పటికే ఉన్న స్లాబ్‌లపై పర్సంటేజీలవారీగా పెంచారు. అలాగే 4 శాతం ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌ ఫీజును 5.5 శాతానికి పెంచింది. 2022 ఫిబ్రవరి 1న రెండోసారి అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చరల్ భూములు, బిల్డింగ్స్, ఫ్లాట్ల మార్కెట్‌ వాల్యూను మరోసారి పెంచేసింది. ఇప్పటికే అమలవుతున్న భూముల విలువలకు, బహిరంగ మార్కెట్ లో భూముల విలువలకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్​ విలువ పెంపులకు స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖ కసరత్తును దాదాపు పూర్తి చేసింది.

సబ్​రిజిస్ట్రార్​కార్యాలయాల వారీగా క్షేత్రస్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు పర్యటించారు. సర్వే నంబర్ల వారీగా మార్కెట్‌ విలువను పరిశీలించారు. శాస్త్రీయబద్ధంగా మార్కెట్ విలువలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఈసారి అపార్ట్​మెంట్ల రిజిస్ట్రేషన్​ విలువ పెద్దగా పెరిగే అవకాశం లేదని తెలిసింది. ఖాళీ స్థలాల మార్కెట్ వాల్యూ మాత్రమే ఉండబోతుందని సమాచారం. ఇది అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లు కొనేవారికి కొంత ఊరటే. మార్కెట్ వాల్యూ పెంపు ద్వారా రూ.4,000ల కోట్లకు పైగా అదనంగా ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.