డీఎంకే వర్సెస్ బీజేపీ.. దద్దరిల్లిన పార్లమెంట్ ఉభయ సభలు

డీఎంకే వర్సెస్ బీజేపీ.. దద్దరిల్లిన పార్లమెంట్ ఉభయ సభలు

న్యూఢిల్లీ: బీజేపీ, డీఎంకే నేతల మాటల యుద్ధంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. సోమవారం (మార్చి 10) పార్లమెంట్ బడ్జెట్ రెండో సెషన్ ప్రారంభం కాగానే డీఎంకే ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. డీలిమిటేషన్, త్రిభాషా సిద్ధాంతానికి వ్యతిరేకంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే ఎంపీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుతో డీఎంకే రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు.

‘‘డీఎంకే ఎంపీలు నిజాయితీ లేనివారు. వారు తమిళనాడు విద్యార్థుల పట్ల నిబద్ధత కలిగి లేరు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. వారి ఏకైక పని భాషా అడ్డంకులను పెంచడమే. విద్యను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. డీఎంకే ఎంపీలు అప్రజాస్వామికులు, అనాగరికులు’’ అంటూ కేంద్రమంత్రి ధరేంద్ర ప్రధాన్ నిప్పులు చెరిగారు. 

ALSO READ | కుంభమేళా మిస్టరీ: వెయ్యి మంది వరకు తప్పిపోయారు..ఎటు వెళ్లారు.. ఎక్కడికి వెళ్లారు..?

కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన డీఎంకే ఎంపీలు.. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ వెల్‎లోకి దూసుకెళ్లారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్య సభలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. డీలిమిటేషన్, త్రిభాషా సిద్ధాంతం, మణిపూర్ అలర్లపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో డిప్యూటీ చైర్మన్ రాజ్య సభను వాయిదా వేశారు. బీజేపీ, డీఎంకే నేతల డైలాగ్ వార్‎తో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.