సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వర్గీయులు తొలగించారు. అధికారం చేతిలో వుందన్న అహంకారంతో తన ఫ్లెక్సీ లను తొలగించారని మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఫ్లెక్సీలను తీసేశారని.. దీనిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
కాగా సోమవారం పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కలెక్టరేట్ సహా టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.