యూనివర్సిటీలో నార్త్ Vs సౌత్ స్టూడెంట్స్: చపాతీల విషయంలో పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు..!

యూనివర్సిటీలో నార్త్ Vs సౌత్ స్టూడెంట్స్: చపాతీల విషయంలో పిచ్చపిచ్చగా కొట్టుకున్నారు..!

బెంగుళూర్: విద్యా సంస్థలు, యూనివర్శిటీల్లో స్టూడెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. విద్యార్థి సంఘాల మధ్య భావజాలాలు గురించి.. గ్రూప్‎ల మధ్య గ్యాంగ్ వార్లు జరుగుతుంటాయి. కొన్ని సార్లు అమ్మాయిల విషయంలో స్టూడెంట్స్ గొడవలు పడుతుంటారు. తాజాగా కర్నాటకలో కూడా ఇలాంటి తరహా ఘటనే ఒకటి జరిగింది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. కానీ ఇక్కడ గొడవ జరిగింది మరీ చెండాలంగా చపాతీల కోసం. అందులోనూ చపాయి తయారీ విధానంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి చివరకు విద్యార్థులు బాహాబాహీ దిగే వరకు వెళ్లింది. 

పోలీసుల వివరాల ప్రకారం.. కలబురగిలోని కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ క్యాంటీన్‎లో శుక్రవారం (మార్చి 7) రాత్రి చపాతీల విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. మిషన్‎తో చేసిన చపాతీలు కావాలని నార్త్ విద్యార్థులు.. లేదు మాకు చేతితో చేసిన చపాతీలు పెట్టాలని సౌత్ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో చపాతీల తయారీ విషయంలో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. సౌత్, నార్త్ విద్యార్థులు ఒకరిపై ఒకరు పరస్పరం భౌతిక దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో అనికేత్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. 

ALSO READ | బెడ్ మీద నుంచి లేచొచ్చిన కోమా పేషెంట్.. డాక్టర్లు దోచుకుంటున్నారంటూ ఫైర్..

మరికొందరు స్టూడెంట్స్ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన క్యాంప‎స్‎కు చేరుకున్నారు. పోలీస్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. చివరకు పోలీసులు, యూనివర్శిటీ సిబ్బంది సర్ధి చెప్పడంతో విద్యార్థులు చల్లబడ్డారు. క్యాంపస్‎లో నార్త్, సౌత్ విద్యార్థుల మధ్య జరిగిన వివాదంపై యూనివర్శిటీ రిజిస్ట్రార్ నరోనా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థుల మధ్య గొడవపై  దర్యాప్తు చేస్తున్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల విద్యార్థుల మధ్య వివాదం జరగడంతో క్యాంపస్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వర్శిటీలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.  

ఇదిలా ఉండగానే.. కర్నాటకలో మరో ఘటన చోటు చేసుకుంది. కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన ఓ యువకుడు కర్నాటక బీజాపూర్‌లోని అల్-అమీన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఆ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ చేసి.. శారీరంగా దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరింది. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. "ఈ దురదృష్టకర సంఘటన గురించి నేను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడాను. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆయన నాకు హామీ ఇచ్చారు. నలుగురు నిందితులను గుర్తించారు" అని ఒమర్ అబ్ధుల్లా పేర్కొన్నారు.