కామారెడ్డి బీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు

కామారెడ్డి: కామారెడ్డి బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నిన్న కామారెడ్డి సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో మాచారెడ్డి మండల నాయకులు సమావేశమయ్యారు.  మాచారెడ్డి జెడ్పీటీసీ రాంరెడ్డిపై ఎంపీపీ నర్సింగరావు దాడి చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇందులో లీడర్ల మధ్య మాటామాటా పెరిగింది. జెడ్పీటీసీ సొంతూరు చుక్కాపూర్ విషయంలో ఎంపీపీ జోక్యం ఏమిటంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో జెడ్పీటీసీని ఎంపీపీ నెట్టేసినట్టు బీఆర్ ఎస్ లీడర్లు చెబుతున్నారు.ఈ గొడవలో జెడ్పీటీసీ ముఖంపై గాయమైంది.  విషయం తెలుసుకున్న చుక్కాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎంపీపీ నర్సింగరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. అక్కడి నుంచి  నేరుగా జిల్లా కేంద్రానికి వచ్చి ఎంపీపీపై  చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఇంటి ముందు ధర్నా  నిర్వహించారు. తాను మాట్లాడుతానని గంపగోవర్ధన్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా మరో వైపు ఎంపీపీ నర్సింగరావు అనుచరులు మాచారెడ్డి మండల కేంద్రంలో జెడ్పీటీసీ రాంరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది.