కేసీఆర్ ప్రకటనతో  పెరుగుతున్న వర్గపోరు..

  • టీఆర్ఎస్​లో ప్రొటోకాల్​ చిచ్చు!
  • ఆర్మూర్​ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్​ మధ్య  ప్లెక్సీల రగడ
  • ఎమ్మెల్యే తన ఫొటో కావాలనే తొలగిస్తున్నారని జడ్పీ చైర్మన్​ఆరోపణ
  • జిల్లాలో  రెడ్డి  వర్సెస్ రావు వర్గాలుగా చీలిన క్యాడర్​
  • బాగా పనిచేసే జడ్పీ చైర్మన్లకు ఎమ్మెల్యే టికెట్​ ఇస్తామన్న గులాబీ బాస్​​
  • కేసీఆర్ ప్రకటనతో  పెరుగుతున్న వర్గపోరు..

నిజామాబాద్, వెలుగు:   టీఆర్ఎస్ ​జిల్లా పార్టీలో ప్రొటోకాల్​ చిచ్చు రగులుకుంటోంది. పార్టీ , అధికారిక కార్యక్రమాల్లో  రెడ్డి వర్సెస్ ​రావు ల మధ్య వర్గపోరుకు దారితీస్తోంది. ఈ నెల 5న జిల్లాలో జరిగిన సీఎం  మీటింగ్​ సభావేదికపై  ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జడ్పీ చైర్మన్ ​విఠల్​రావు  ఫొటో లేకపోవడంతో వాగ్వాదం జరిగింది. అప్పుడు ఆర్మూర్ ​ఎమ్మెల్యే, టీఆర్ఎస్​జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్​రెడ్డి కావాలనే జడ్పీ చైర్మన్ ​ఫోటో తొలగించారని ఆయన వర్గీయులు ఆరోపించారు. తాజాగా సమైక్యతా ఉత్సవాల్లో సభావేదికపై  ప్రొటోకాల్ ​పాటిస్తలేరని జిల్లా అధికారులపై  ఆగ్రహం వ్యక్తం చేసి జడ్పీ చైర్మన్​ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయారు. ఇలా తరచూ వర్గపోరు రాజుకుంటుండడంతో జిల్లాలో టీఆర్ఎస్​ పార్టీ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.  

రెండేళ్లుగా వర్గపోరు..

టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్​ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్​ విఠల్ ​రావు మధ్య  రెండేళ్ల నుంచి వర్గపోరు సాగుతోంది.  విఠల్ రావు 2020లో ఆర్మూర్​ నియోజకవర్గంలోని మాక్లూర్​జడ్పీటీసీగా గెలుపొంది జడ్పీ చైర్మన్​గా ఎన్నికయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో  ఎమ్మెల్యేతో  పోటా పోటీగా పాల్గొనడంతో వర్గ పోరు షురూ అయ్యింది.  లక్కంపల్లి సెజ్​లో జరిగిన అభివృద్ధి కార్యక్రమానికి జడ్పీ చైర్మన్​విఠల్​రావును ఆహ్వానించలేదు. అయినా ఆయన అక్కడికి వెళ్లడంతో పోలీసులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలోనే అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే,  చైర్మన్ ​వర్గాలుగా పార్టీ ​క్యాడర్ ​విడిపోయింది. గత ఫిబ్రవరిలో టీఆర్ఎస్​ జిల్లా పార్టీ ఆఫీసులో జరిగిన  ఓ ప్రెస్​మీట్​లో ప్రొటోకాల్​ పాటిస్తలేరని   జీవన్​రెడ్డిపై  విఠల్​రావు అసహనం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్​ను బాయ్​కాట్​చేసి  వెళ్లిపోయారు.  

స్ట్రాటజీతోనే చెక్​ పెడుతున్నారా?

జడ్పీ చైర్మన్​ విఠల్ రావు ఫోటోను పార్టీ ప్లెక్సీలో  కావాలనే తొలగిస్తున్నారని చర్చ సాగుతోంది. ఇరవై రోజల కింద జరిగిన టీఆర్ఎస్​ఎల్పీ మీటింగ్​లో సీఎం కేసీఆర్..​పనితీరు బాగున్న జడ్పీ చైర్మన్​లను గుర్తించి ఎమ్మెల్యే టికెట్​ఇస్తామని,  సిట్టింగ్​ఎమ్మెల్యేలు సీటు త్యాగం చేయాలని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే  సీఎం సభావేదికపై  పెట్టిన ప్లెక్సీలో  ప్రొటోకాల్​ పాటించలేదని జడ్పీ  చైర్మన్​ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్​రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తన ఫొటోను జిల్లా పార్టీ ఆఫీస్ ​ప్రారంభోత్సవ  ప్లెక్సీలోనూ, ఆర్మూర్​ నియోజకవర్గ ప్లెక్సీల్లోనూ వేయలేదని మంత్రి ప్రశాంత్​ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. పొరపాటున జరిగి ఉంటుందని, మళ్లీ రిపీట్​ కాకుండా చూస్తానని మంత్రి చెప్పడంతో చైర్మన్​ సైలెంట్​ అయ్యారు. కానీ ఈ వ్యవహారాన్ని విఠల్​రావు  పార్టీ అధ్యక్షుడు  కేసీఆర్,  వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ​దృష్టికి  తీసుకువెళ్లినట్లు తెలిసింది. 

రావు వర్సెస్ ​రెడ్డి 

 సీఎం బంధువైన జడ్పీ చైర్మన్  విఠల్ రావు,  టీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు జీవన్​రెడ్డి మధ్య వర్గ పోరు రెడ్డి వర్సెస్​ రావు అన్నట్లు సాగుతోంది. బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి ప్రశాంత్​ రెడ్డి వీరి మధ్య సయోధ్యకు యత్నిస్తున్నారు. సీఎం సభావేదికపై జరిగిన ప్లెక్సీ వివాదంలో మంత్రి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ప్రశాంత్​ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జీవన్​రెడ్డి  ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎమ్మెల్యే వెనుక మంత్రి ఉండి కావాలనే  జడ్పీ చైర్మన్​కు  పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారని విఠల్​రావు వర్గీయులు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జీవన్​రెడ్డికి విఠల్​రావు పోటీ పడకుండా చేయాలనే  స్ట్రాటజీతోనే  చెక్​ పెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.