మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో గొడవలు షురూ

  • చౌటుప్పల్​లో బీజేపీ గో బ్యాక్​నినాదాలు
  • నారాయణపురంలో బీజేపీ వర్సెస్ ​కాంగ్రెస్​
  • రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్​ కార్యకర్తలు
  •  సర్ది చెప్పిన పోలీసులు 

యాదాద్రి, వెలుగు: ఉప ఎన్నికల ప్రచారంతో పాటు గొడవలు కూడా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా సాగిన క్యాంపెయిన్​ ఇప్పుడు ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. సోమవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో డీకే అరుణ ప్రసంగానికి కొద్ది మంది అడ్డుతగలగా, సంస్థాన్‌ నారాయణపురంలో బాబుమోహన్‌ పర్యటన సందర్భంగా కాంగ్రెస్​, బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది.  

చిన్నకొండూరులో...

యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మండలం చిన్నకొండూరులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మి ప్రచారానికి వచ్చారు. లక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో గుడి నిర్మాణానికి రాజగోపాల్​రెడ్డి నిధులు ఇచ్చాడని చెప్పారు. దీంతో అక్కడున్న కొందరు నిధులు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఎలా చెబుతాని ప్రశ్నిస్తూ వేదిక వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదే సమయంలో డీకే అరుణ మాట్లాడుతూ పింఛన్లు కేసీఆర్​ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని, ప్రజల సొమ్మే ప్రజలకు ఇస్తున్నారన్నారు. దీంతో అక్కడున్న కొందరు ఎవరూ ఇంట్లో నుంచి ఇవ్వరని, ప్రజల సొమ్మే ఇస్తారని కామెంట్​ చేశారు. దీంతోపాటు అరుణ ప్రసంగం ముగిసేంతవరకూ వేదిక వైపునకు వచ్చే ప్రయత్నం చేస్తూ గో బ్యాక్​ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోగా వారితోనూ వాగ్వాదానికి దిగారు.  కొద్దిసేపటికి సర్దిచెప్పి పంపించివేశారు. 

సంస్థాన్​ నారాయణపురంలో..

సంస్థాన్​ నారాయణపురంలో ప్రచారం కోసం రేవంత్​వస్తుండడంతో కాంగ్రెస్​ కార్యకర్తలు మైక్‌లు ఏర్పాటు చేసి కొందరు సింగర్స్​తో పాటలు పాడిస్తున్నారు. అదే టైంలో బీజేపీ నేత, మాజీ మంత్రి బాబుమోహన్​ అక్కడికి చేరుకున్నారు. దీంతో కొందరు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్​వేదిక వద్దకు వెళ్లి కొద్దిసేపు మైక్‌ ఆపాలని కోరారు. అయినా బంద్​ చేయకపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఓ బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ ​వేదికపైకి ఎక్కి మైక్​ బంద్​ చేసే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్​కార్యకర్తలు అతడిని బయటకు తోసేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు గుంపుగా అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. అనంతరం మైక్​ను కాంగ్రెస్​ కార్యకర్తలు ఆపేయడం, బాబుమోహన్​సభ పూర్తి కావడం  జరిగింది. ఈ పరిణామాల తర్వాత కాంగ్రెస్​ వేదికపై మైక్‌లు పని చేయకపోవడంతో బీజేపీ కార్యకర్తలే వైర్లు పీకేశారన్న ఉద్దేశంతో రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. పోలీసులు కల్పించుకొని వారికి నచ్చజెప్పి పక్కకు తప్పించారు.