ఏడాది క్రితం అమ్మాయి చెప్పిందే ఇప్పుడు వయనాడ్‌లో జరిగింది

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడి దాదాపుగా 300 మందికి పైగా మృతి చెందగా.. మరో 200 మందికి పైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా వందలమంది ఇప్పటికీ శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నారు. ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు  జరుగుతున్నాయి.

అయితే, ఈ తీవ్ర విషాద ఘటన  వేళ ప్రకృతి ప్రకోపానికి గురైన చూర్మాలాల్ గ్రామానికి చెందిన ఓ ఎనిమిదో తరగతి విద్యార్థిని రాసిన  కథ వైరల్ గా మారింది. కొండచరియల వల్ల జరిగే ప్రమాదాన్ని హెచ్చరిస్తూ ఆ విద్యార్థిని స్కూల్ మేగజైన్ లో రాసిన స్టోరీ సరిగ్గా ప్రస్తుతం వయనాడ్ లో జరిగిన బీభత్సానికి సరితూగుతుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు కొండచరియలు విరిగిపడి మానవ జీవితాలతో సహా వాటి మార్గంలోని ప్రతిదాన్ని మింగేస్తాయని ఆ బాలిక హెచ్చరించింది.

బాలిక కథ ప్రకారం.. ఓ ఇద్దరు బాలికలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వాటర్ ఫాల్స్ ను చూడటానికి వెళ్లగా.. ప్రమాదం పొంచి ఉంది ఇక్కడ నుండి వెళ్లండని ఓ పక్షి వారిని హెచ్చరిస్తుంది. అప్పటికే కొండపై నుండి జాలువారుతోన్న నీటిని చూసి ఆ బాలికలు భయంతో వెంటనే అక్కడ నుండి వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకుంటారు.  

ఆ బాలిక రాసినట్లుగానే  సరిగ్గా ఏడాదికే భారీ వరదలు, కొండచరియలు విరిగిపడి చూర్మాలాల్ గ్రామంలోని బాలిక చదువుతోన్న పాఠశాల నేలమట్టం అయ్యింది. ఈ ప్రకృతి విపత్తులో ఆ బాలిక తన తండ్రిని కూడా కోల్పోయిందని బాలిక రాసిన లేఖను ఉటంకిస్తూ నేషనల్ మీడియా ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఓ ఆర్టికల్ రాసింది. ఈ  తీవ్ర విషాదంలో ఎనిమిదో తరగతి బాలిక రాసిన ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.