- చీటి ఉమేశ్ రావు వర్సెస్ కేకే
రాజన్న సిరిసిల్ల,వెలుగు : సిరిసిల్లలో కాంగ్రెస్ లో కిరికిరి మొదలైంది. రెండు వర్గాల మధ్య వర్గపోరు తీవ్రమైంది. ఆరు నెలల నుంచి పరస్పర విమర్శలతో సాగిన పోరు పరస్పరం దాడులు చేసుకునేకాడికి వచ్చింది. రెండు రోజుల కిందట సిరిసిల్ల డీసీసీ ఆఫీసులో కేసీఆర్ మేనల్లుడు చీటి ఉమేశ్ రావు వర్గం, సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి వర్గం మధ్య గొడవ జరిగింది.
రేవంత్ రెడ్డి టూర్ నుంచి మొదలు
ఎండకాలంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్యగొడవ జరిగింది. తంగళ్లపల్లి మండలం నుంచి సిరిసిల్ల మీదుగా సాగిన పాదయాత్రలో కేకే మహేందర్ రెడ్డి, చీటీ ఉమేశ్ రావు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కేకే ఫ్లెక్సీలను ఉమేశ్ వర్గం చింపివేయడంతో గొడవ ప్రారంభమైంది. రేవంత్ పాదయాత్ర నుంచి మొదలైన వార్ ఇప్పటికీ కొనసాగుతోంది.
ఫ్లెక్సీపై ఫోటో పెట్టలేదని తన్నుకున్నరు
రెండు రోజుల కిందట డీసీసీ ఆఫీసులో నియోజక వర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఫ్లెక్సీపై కేకే ఫోటో పెట్టలేదని ఆయన వర్గీయులు ఉమేశ్ వర్గీయులను ప్రశ్నించగా గొడవ ప్రారంభమైంది. గూడెంలో కొంత మంది యువకులను పార్టీలో చేర్చుకునే విషయంపై ముస్తాబాద్ మండల్ ప్రెసిడెంట్ కు కనీస సమాచారం ఇవ్వలేదన్న విషయంలో గొడవ ముదిరి తన్నుకునే వరకు వెళ్లింది. డీసీసీ ఆఫీసులోనే రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగద్దులకు దిగి కుర్చీలు విసుకున్నారు.
మందలించని నాయకత్వం
ఇద్దరుమ నాయకుల అనుచరులు దాడులకు దిగుతున్నా జిల్లా , రాష్ట్ర నాయకత్వం కనీసం కూర్చోబెట్టి మాట్లాడలేదు. గొడవ జరిగిన రోజు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రెస్ మీట్ నిర్వహించి వెళ్లిపోయారు. దీంతో ఎక్కడి గొడవ అక్కడే ఉండిపోయింది.
రోజూ ప్రెస్ మీట్లు
సిరిసిల్ల లో ఎవరికి వారే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. గొడవ జరిగిన రెండో రోజు కేకే వర్గానికి చెందిన ఐదు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రెస్ మీట్ పెట్టి కేకే కు అండగా ఉంటామని ప్రకటించారు. మరుసటి రోజు సంగీతం శ్రీనివాస్ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ముగ్గురు నేతలు పోటీలో ఉంటున్నట్లు ప్రకటించుకుంటున్నారు.
క్యాడర్ లో అయోమయం
సిరిసిల్ల కాంగ్రెస్ క్యాడర్ లో ఆయోమయం నెలకొంది. రెండు వర్గాల మధ్య వర్గపోరు పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిపోయాక సిరిసిల్లలో బీజేపీ జోరు తగ్గగా, కాంగ్రెస్ దూకుడు పెంచింది. స్టేట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే జిల్లాలో వందలాది మంది కార్యకర్తలు కలిసి వచ్చారు. కానీ వర్గ పోరుతో సామాన్య కార్యకర్తలు ఆయోమయంలో పడుతున్నారు. ఇద్దరి నేతలమద్య జరుగుతున్న వైరం పార్టీకి నష్టం తెచ్చేటట్లుందని కార్యకర్తలు బాహాటంగా చర్చించుకుంటున్నారు.