హైదరాబాద్​లోని బాచుపల్లిలో గుంతల రోడ్డుకు చిన్నారి బలి

నిజాంపేట, వెలుగు:  హైదరాబాద్​లోని గుంతల రోడ్లు.. ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నాన్నతో కలిసి స్కూటీపై స్కూల్​కు బయలుదేరిన ఆ పాప.. తిరిగిరాని లోకాలకు వెళ్లింది. గుంతల రోడ్డు కారణంగా స్కూటీ స్కిడ్​ అయి తండ్రీకూతురు పడిపోయారు. ఆ గుంతలో నుంచి లేవబోతుండగా.. వెనుక నుంచి వచ్చిన స్కూల్​ బస్సు వారిపైనుంచి దూసుకెళ్లింది. అక్కడికక్కడే పాప చనిపోగా.. తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. బాచుపల్లిలోని ఇంద్రప్రస్థ అపార్ట్​మెంటులో నివాసం ఉంటున్న కిశోర్, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు దీక్షిత (8) బౌరంపేట్​లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్​లో థర్డ్​ క్లాస్​ చదువుతున్నది. 

బుధవారం ఉదయం దీక్షతను స్కూల్లో దిగబెట్టేందుకు తండ్రి కిశోర్ ​స్కూటీపై బయలుదేరాడు. రోడ్డంతా గుంతలమయంగా ఉండటంతో రెడ్డీ ల్యాబ్​ పరిసరాల్లో స్కూటీ స్కిడ్​ అయింది. దీంతో స్కూటీపై నుంచి కిశోర్, దీక్షిత కింద పడిపోయారు. అదే టైమ్​లో వెనుక నుంచి వస్తున్న భాష్యం స్కూల్ బస్సు.. వాళ్ల మీది నుంచి దూసుకెళ్లింది. బస్సు టైర్ల కింద దీక్షిత నలిగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కిశోర్​కు చేయి విరిగింది.  ఆయనను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పాప మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్​కు తరలించారు. రోడ్లు ఖరాబైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గుంతల రోడ్లకు తోడూ బస్సు డ్రైవర్​ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి బలైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి బాచుపల్లి సీఐ సుమన్  చేరుకొని పరిశీలించారు. డ్రైవర్​పై కేసు నమోదు చేసి, బస్సును సీజ్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

గుంత కారణంగానే..

రోడ్డుపై గుంతల కారణంగానే ప్రమాదం జరిగి చిన్నారి చనిపోయింది. దీక్షిత, ఆమె తండ్రి వెళ్తున్న బైక్ రోడ్డుపై ఉన్న గుంత కారణంగా అదుపుతప్పింది. దీంతో వాళ్లిద్దరూ కిందపడిపోయారు. అదే టైమ్​లో స్పీడ్​గా  వస్తున్న స్కూల్ బస్సు చిన్నారిపై నుంచి వెళ్లడంతో  దీక్షిత అక్కడికక్కడే మృతి చెందింది.

- ఆనంద్, స్థానికుడు

ప్రభుత్వ తప్పిదమే

విశ్వనగరంగా హైదరాబాద్​ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునే మంత్రి కేటీఆర్​కు రోడ్డుపై ఉన్న గుంతలు కనిపిస్తలేవా? ఎనిమిదేండ్ల చిన్నారి చనిపోవడం చాలా బాధాకరం. నిజాంపేట కార్పొరేషన్​లోని రహదారులు పూర్తిగా అధ్వానంగా తయారైనయ్. వాటికి ప్రభుత్వం రిపేర్లు చేయించడం లేదు. ఆ తప్పిదం వల్లే చిన్నారి బలైంది. 

- ఆకుల సతీశ్, బీజేపీ నేత, నిజాంపేట కార్పొరేషన్