సమ్మర్ హాలిడేస్​లో క్లాసులు.. 40 కాలేజీలకు ఫైన్

సమ్మర్ హాలిడేస్​లో క్లాసులు.. 40 కాలేజీలకు ఫైన్

హైదరాబాద్, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా సమ్మర్ లో క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝులిపించింది. సుమారు 40 కాలేజీలకు ఫైన్ వేసింది. ఆ కాలేజీలన్నీ దాదాపుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనివే ఉన్నాయి. ఫైన్ పడినవాటిలో రెజోనెన్స్, శ్రీవశిష్ట, తపస్య, నారాయణ, ఎక్స్​లెన్సియా, అర్బెన్, అవినాశ్ తదితర కాలేజీలు ఉన్నాయి. ఒక్కో మేనేజ్మెంట్ పరిధిలోని పలు బ్రాంచులపైనా ఇంటర్ బోర్డు అధికారులు ఫైన్ వేశారు. కొన్ని కాలేజీలకు రూ. లక్ష చొప్పున, ఇంకొన్ని కాలేజీలకు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించారు.

అయితే, రెండు కార్పొరేట్ కాలేజీలు ఇంకా క్లాసులు నిర్వహిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. మార్చి 31 నుంచి మే 31 వరకూ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సమ్మర్ హాలీడేస్ ఇచ్చింది. క్లాసులు నిర్వహించొద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా, కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే క్లాసులు నిర్వహిస్తున్నాయి.

దీనిపై స్టూడెంట్ యూనియన్ల లీడర్లు ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. సర్కారు దృష్టికి కూడా పోవడంతో అధికారులు కాలేజీలను తనిఖీ చేసి, ఫైన్ లు వేశారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హెచ్చరించారు.