- ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు షురూ..
- జాకారం వైటీసీలో క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు
- సెప్టెంబర్ 15 తర్వాత తరగతులు ప్రారంభం
- హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఆధ్వర్యంలో అడ్మిషన్ల ప్రక్రియ
- ట్రైబల్ వర్సిటీ కోసం ఇప్పటికే 335 ఎకరాలు కేటాయింపు
జయశంకర్ భూపాలపల్లి/ములుగు/వెలుగు : ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లో ఎట్టకేలకు వచ్చే నెల నుంచి క్లాసులు ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది బీఏ ఇంగ్లిష్ (ఆనర్స్), బీఏ ఎకనామిక్స్ (ఆనర్స్) లో ప్రవేశాల కోసం అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారు. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ‒2024) లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నారు. సెప్టెంబర్ 15 తర్వాత క్లాసులు స్టార్ట్ అవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ములుగు జిల్లా జాకారాం వైటీసీ బిల్డింగ్‌లో తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే 335 ఎకరాల ప్రభుత్వస్థలాన్ని కేటాయించగా.. కేంద్ర ప్రభుత్వం రూ.889 కోట్ల నిధులను విడుదల చేసింది.
2023లో పార్లమెంటు ఆమోదం
రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు 2014లోనే అడుగులు పడ్డాయి. పదేళ్ల కిందట రాష్ట్ర విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటును పొందుపర్చారు. 2023 అక్టోబర్ 1న పాలమూరు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ట్రైబల్ యూనివర్సిటీని ఆదివాసీల ఆరాధ్యదైవాలు సమ్మక్క సారక్కల పేరుతో ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత డిసెంబర్ 7న లోక్‌సభలో ట్రైబల్ యూనివర్సిటీ బిల్లు ఆమోదం పొందింది. నిరుడు డిసెంబర్ 13న రాజ్యసభ ఆమోదం తెలపగా ఆ వెంటనే డిసెంబర్ 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో ట్రైబల్ వర్సిటీకి చట్టబద్ధత లభించింది. 2024 మార్చి 8న ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కిషన్ రెడ్డి, సీతక్క, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫీసర్లతో కలిసి ములుగు జిల్లాలోని జాకారం వైటీసీ బిల్డింగ్‌లో తాత్కాలిక క్యాంపస్‌ను ప్రారంభించారు. ములుగు మండలం జాకారం యూత్ ట్రెయినింగ్ సెంటర్ (వైటీసీ) లో తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
2024 విద్యా సంవత్సరం సెప్టెంబరు నుంచి క్లాసులు ప్రారంభించేందుకు అడ్మిషన్ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతానికి బీఏ ఇంగ్లిష్ (ఆనర్స్), బీఏ ఎకనామిక్స్(ఆనర్స్) లో మాత్రమే అడ్మిషన్లు ఇస్తున్నామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ గైడ్‌లైన్స్ ప్రకారం రెండు గ్రూపులలో కలిపి 64 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అడ్మిషన్ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే చేపడుతున్నారు. రాష్ట్రానికి చెందిన గిరిజన విద్యార్థులకు 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. యూజీసీ నిబంధనల మేరకు అన్ని వర్గాల విద్యార్థులకు ప్రవేశ అవకాశం కల్పించారు. దీనికోసం www.ssctu.ac.in ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోనే క్లాసులు నిర్వహిస్తారు. ఇక్కడి నుంచే ప్రొఫెసర్లు వచ్చి బోధన చేస్తారు.
జాకారం వైటీసీలో ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
సెప్టెంబరులో క్లాసులు నిర్వహించడానికి జాకారం వైటీసీలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. క్లాస్ రూములు, లైబ్రరీతో పాటు విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ ఫెసిలిటీస్, టాయిలెట్స్, కిచెన్ వంటి సౌకర్యాలు కల్పించే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం పనులు కొనసాగుతుండటంతో వైటీసీ బిల్డింగ్‌ను ఇంకా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫీసర్లకు అప్పగించలేదని ములుగు ట్రైబల్ యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్ వంశీ తెలిపారు. సెప్టెంబర్ 15 వరకు కౌన్సెలింగ్ పూర్తి చేసి క్లాసులు ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.