సిరిసిల్ల మెడికల్ కాలేజీ కోసం రూ.6.80 కోట్లు

    ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కరీంనగర్, వెలుగు: కొత్తపల్లి పట్టణ శివారులోని సీడ్స్ గోదాంలో ఏర్పాటు చేయబోతున్న కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. క్లాసులు నిర్వహించడానికి వీలుగా ఈ గోదాంను రినోవేట్ చేసేందుకు రూ.7 కోట్లు కేటాయించింది. కాగా మెడికల్ కాలేజీ నిర్వహణకు గోదాంను ఎంపిక చేయడంపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మంచిర్యాల జిల్లాలోనూ అగ్రికల్చర్ మార్కెట్ యార్డు గోదాముల్లో మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే పర్మిషన్ విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. మిగతా ఏడు కాలేజీలకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ రూల్స్ ప్రకారం కాలేజీకి భవనం లేనందున మంచిర్యాల కాలేజీకి పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర అధికారులు రెండోసారి అఫిడవిట్ తో అప్పీల్ చేస్తే పర్మిషన్ ఇచ్చింది. గతంలో ఇలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ సీడ్స్ గోదాంలో కరీంనగర్ మెడికల్ కాలేజీని ప్రారంభించేందుకు సిద్ధం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఫస్టీయర్​లో 100 అడ్మిషన్లు..

కరీంనగర్ మెడికల్ కాలేజీలో 2023–24 నుంచే ఫస్టీయర్ క్లాసులు ప్రారంభించబోతున్నారు. నీట్–2023 ద్వారా ఫస్టీయర్లో 100 అడ్మిషన్లు కల్పించబోతున్నారు. క్లాసులు, కాలేజీ నిర్వహణ కోసం త్వరలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర టీచింగ్ పోస్టులతోపాటు క్లరికల్ స్టాఫ్​ను నియమించనున్నారు. ప్రభుత్వం కేటాయించిన రూ.7 కోట్లతో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాసులు చెప్పేందుకు ఫిజియాలజీ, బయోకెమిస్ర్టీ, అనాటమీ డిపార్ట్​మెంట్లు, లెక్చర్ హాళ్లు, ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారు.  

జిల్లా హాస్పిటల్ పై సిరిసిల్ల మెడికల్ కాలేజీ..

రాజన్న  సిరిసిల్ల జిల్లాకు మంజూరైన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని జిల్లా హాస్పిటల్ పైనే ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న రెండంతస్తుల హాస్పిటల్ బిల్డింగ్ పై మూడో ఫ్లోర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.6.80  కోట్లు కేటాయించింది. కరీంనగర్, సిరిసిల్ల మెడికల్ కాలేజీ పనులను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎంఎస్ఐడీసీ) చేపట్టనుంది.