లోకల్ మట్టి విగ్రహాలకు భలే డిమాండ్

లోకల్ మట్టి విగ్రహాలకు భలే డిమాండ్

వినాయక చవితికి సిద్ధమవుతున్న మట్టి గణపతులు

వినాయక చవితికి గణేష్ విగ్రహాల తయారీ పూర్తయింది.. అక్కడా ప్యాచ్ వర్కులు మాత్రమే జరుగుతున్నాయి. దేశమంతా ఇదే పరిస్థితి. అయితే కరీంనగర్ జిల్లాలోని ఒక ప్రాంతంలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. ఇక్కడ అంతా మట్టి గణపతులే. బొమ్మకల్ కేంద్రంగా భారీ సైజు మట్టి గణపతులు తయారు చేస్తూ ఏటా వినాయక చవితికి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. 

మట్టి గణపతుల తయారీ వెనుక కథ ఏంటంటే..

బొమ్మకల్ కేంద్రంగా మట్టి గణపతుల తయారీ వెనక గ్రామస్థుల పర్యావరణ స్పృహ దాగి ఉంది. తమ ఊరి శివారులో ఉండే మానేరు కలుషితానికి రసాయన వినాయక విగ్రహాలు కారణమని గుర్తించి.. ఊరంతా మట్టి విగ్రహాలు వాడటమే కాకుండా.. అందరితో మట్టి విగ్రహాలే ప్రతిష్ఠించేలా ఆలోచన చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఆదరిస్తుండడంతో బొమ్మకల్ మట్టి వినాయక విగ్రహాలకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. 

చిన్నవి మొదలు.. భారీ సైజు కూడా మట్టివే

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పర్యావరణ సమస్యలు పెరుగుతుండడంతో గత కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలపై అంతటా అవగాహన పెరుగుతోంది. ఒకప్పుడు చిన్నసైజులో ఉండే విగ్రహాలు మాత్రమే మట్టితో తయారయ్యేవి. కానీ రాను రాను భారీ సైజు వినాయక విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ గ్రామంలో ఇలాంటి భారీ మట్టి ప్రతిమలు పెద్ద ఎత్తున తయారవుతున్నాయి. ఏకంగా 30 అడుగుల ఎత్తైన విగ్రహాలు కూడా బెంగాల్ కళాకారులు తయారు చేస్తున్నారు. బొమ్మకల్ సమీపంలోని మానేరు వాగు కలుషితం అవడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కెమికల్ విగ్రహాలు కూడా కారణమని గుర్తించిన స్థానికులు మట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపారు. ఒక్క తమ ఊరిలో మట్టి గణపతులు ప్రతిష్ఠిస్తే సరిపోదని భావించిన కొంతమంది.. మట్టి విగ్రహాలను తమ ఊరిలోనే తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. మొదట్లో కొంతకాలం హైదరాబాద్ నుంచి మట్టి వినాయక విగ్రహాలు కొనుగోలు చేసి బొమ్మకల్ కు  తీసుకువచ్చేవారు. కానీ.. తామే ఇక్కడ తయారు చేస్తే ఎలా ఉంటుందని భావించిన గ్రామస్థులు వినాయకులను తయారు చేసే వారిని బెంగాల్ నుంచి రప్పించి తమ ఊరిలోనే తయారి చేపట్టారు. 

లోకల్ బంక మట్టి.. ఎండు వరిగడ్డి, వెదురు బొంగులతో తయారీ

మట్టిగణపతుల తయారీలో చెరువుల నుంచి తెచ్చిన బంకమట్టి, ఎండిపోయిన వరిగడ్డి, తవుడు, ఊక, వెదురు బొంగులు వాడుతున్నారు. ఇవన్నీ పర్యావరణహితమని చెబుతున్నారు. భారీసైజ్ విగ్రహాల తయారీకి కొంత బంకమట్టిని ప్రత్యేకంగా బెంగాల్ నుంచి లారీల్లో తెప్పిస్తున్నారు. చెరువులో, వాగులో వీటిని వేసినప్పుడు ఇవన్నీ తేలికగా నీటిలో కరిగిపోతాయి. విగ్రహాల డిజైన్, సైజ్ ఆధారంగా రేట్లు పెట్టారు. కనిష్ఠంగా 3 వేల రూపాయల నుంచి గరిష్ఠంగా 70 వేల రూపాయల దాకా విగ్రహాల ధరలున్నాయి.

20 అడుగులు పైబడితే మంటపాల వద్దకే వచ్చి తయారీ

బొమ్మకల్ గ్రామంలో తయారవుతున్న మట్టి విగ్రహాలకు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది. వీటిని కొనేందుకు చేసేందుకు ఎక్కడికెక్కడినుంచో గణేష్ మంటప నిర్వాహకులు వస్తున్నారు. ఇక్కడ అడుగు పరిణామంలో ఉండే చిన్న సైజ్ మొదలు కొని దాదాపు 20 అడుగుల దాకా బొమ్మకల్ తయారీ కేంద్రంలోనే తయారు చేసి విక్రయిస్తున్నారు. 20 అడుగులకు మించి మట్టి గణపతులు ప్రతిష్ఠించాలనుకునేవారి కోరిక మేరకు నేరుగా మంటపాల దగ్గర వాటిని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్ కు చెందిన దాదాపు 20 మంది కళాకారులు మట్టి వినాయక విగ్రహాలను కళాత్మకంగా రూపొందిస్తున్నారు. పూర్తిగా చేతితో వీటిని తయారు చేస్తున్నారు. మొత్తం బంకమన్నుతో తయారు చేయడంతో పాటు.. వీటికి వేసే రంగులు కూడా వాటర్ కలర్స్ మాత్రమే వాడుతారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు సింథటిక్ కలర్స్ వాడుతారు. కానీ మట్టి విగ్రహాలకు వాడే రంగులు ఇట్టే నీటిలో కరిగిపోతాయని చెబుతున్నారు.

సింహం ప్రతిమలకు జూలు సహజంగా కనిపించేందుకు కొబ్బరి పీచు వాడుతుంటారు. విగ్రహాలు పూర్తయ్యాక వాటికి రంగులేసేందుకు కూడా ప్రత్యేకమైన పెయింటర్లు ఉంటారు. విగ్రహాలకు ధోవతి, పంచె కట్టి అందంగా ముస్తాబు చేసి కావాల్సిన వారికి డెలివరీ చేస్తుంటారు. విగ్రహాల ప్రతిష్ఠాపన చేయాలనుకునే వారు ముందుగానే వచ్చి తమకు కావాల్సిన విగ్రహాలను బుక్ చేసుకుని వెళ్తున్నారు. మరికొంతమంది ముందే తమకు నచ్చిన రూపాన్ని ఆర్డరిచ్చి తయారు చేయించుకుంటున్నారు. బొమ్మకల్ లో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలు చాలా స్పెషల్ అనే పేరు పడిపోయింది. ముఖ్యంగా సింహ వాహన గణపతి, ఉగ్ర నరసింహ గణపతి, పార్వతీ పరమేశ సహిత వినాయకుడు, అర్ధనారీశ్వర రూపంలో ఉండే విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ ఉందని తయారీదారులు చెబుతున్నారు.