రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం

రన్నింగ్  బస్సులో మహిళపై అత్యాచారం
  • ప్రయాణికురాలిపై ప్రైవేట్​ బస్​ క్లీనర్ ​అఘాయిత్యం
  • హైదరాబాద్​ నుంచి ఏపీ వెళ్తుండగా ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
  • బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు 
  • అదుపులో నిందితుడు.. విచారిస్తున్న కూకట్​పల్లి పోలీసులు

కూకట్​పల్లి, వెలుగు: ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ(36)పై క్లీనర్​ అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూకట్​పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​రాష్ట్రం రాజమండ్రి సమీపంలోని సామర్లకోటకు చెందిన మహిళ కొంతకాలంగా హైదరాబాద్​లో హిమాయత్​నగర్​లోని అనిల్​రెడ్డి ఇంట్లో కేర్​ టేకర్​గా పని చేస్తున్నది. ఈ నెల18న రాత్రి 10.40 గంటల సమయంలో తన స్వగ్రామానికి వెళ్లేందుకు కూకట్​పల్లి వై జంక్షన్​ వద్ద మార్నింగ్​స్టార్​ ట్రావెల్స్ బస్సెక్కింది. ఈ బస్సులో క్లీనర్​గా పని చేస్తున్న రెడ్డి సాయికుమార్​(26) ఆమె ఒంటరిగా ఉందని గమనించాడు. ఆమెతో మాటలు కలిపి, వాటర్​ బాటిల్​ తీసుకువచ్చి ఇచ్చాడు. 

బస్సు కదిలిన కొద్ది సేపటితర్వాత ఆమె బుక్​ చేసుకున్న సీటు వద్ద  డిస్ట్రబెన్స్​గా ఉంటుందని నమ్మబలికి.. వెనుక ఖాళీగా ఉన్న సీట్లోకి ఆమెను మార్చాడు. అర్ధరాత్రి ఆమె సీటు వద్దకు వెళ్లి  నోరుమూసి, అత్యాచారం చేశాడు. అరిచినా..ఎవరికైనా చెప్పినా.. చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు భయంతో మౌనంగా ఉండడంతో మరోసారి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు జరిగిన సంఘటన గురించి తన యజమాని  అనిల్​రెడ్డికి ఫోన్​లో చెప్పింది. దీంతో ఆమెను అనిల్​రెడ్డి నగరానికి పిలిపించుకొని, శనివారం చౌటుప్పల్​ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేయించాడు. అక్కడ జీరో ఎఫ్​ఐఆర్​ బుక్​చేసిన చౌటుప్పల్​ పోలీసులు కేసును కూకట్​పల్లి పోలీసులకు ట్రాన్స్​ఫర్​ చేశారు. కూకట్​పల్లి పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు​ చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సాయికుమార్​ను అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు.