బల్దియా ప్రక్షాళన షురూ..విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆఫీసర్ల సరెండర్లు, చార్జీ మెమోలు

బల్దియా ప్రక్షాళన షురూ..విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆఫీసర్ల సరెండర్లు, చార్జీ మెమోలు
  •   ఏళ్ల తరబడి పాతుకుపోయిన సిబ్బందికి బదిలీలు
  •   రెవెన్యూ పెంచేందుకు  స్పెషల్ డ్రైవ్ లు

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌ లో ప్రక్షాళన షురూ అయింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న, అవినీతికి పాల్పడుతున్న ఆఫీసర్లపై అడిషనల్ కలెక్టర్, ఇన్‌‌ చార్జి కమిషనర్ ప్రఫుల్ దేశాయి కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరెండర్ చేయడం, చార్జీ మెమోలు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన సిబ్బందిని సెక్షన్లు మారుస్తున్నారు. బల్దియా రెవెన్యూ పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.

దొడ్డిదారిన ఇచ్చిన ఇంటి నంబర్ల వ్యవహారంపై ఎంక్వైరీ చేయిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జూన్ 18న బల్దియా అధికారుల పనితీరు, అభివృద్ధి పనులు, రెవెన్యూ వసూళ్లపై రివ్యూ మీటింగ్‌‌  నిర్వహించిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఆఫీసర్ల పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని అదే సమావేశంలో హెచ్చరించారు.

దీంతోపాటు ‘కరీంనగర్ కార్పొరేషన్ లో పాలన అస్తవ్యస్తం’ హెడ్డింగ్‌‌ తో ‘వీ6 వెలుగు’ పేపర్‌‌ ‌‌ లో పబ్లిష్‌‌  అయిన స్టోరీలోని అంశాలపై బల్దియా అధికారులను ప్రశ్నించారు. సిటీలోని జంక్షన్ల అభివృద్ధిపై రిపోర్టు ఇవ్వాలని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొడుతున్న నిర్మాణాలను గుర్తించి రీఅసెస్మెంట్ చేయాలని మంత్రి ఆదేశాల మేరకు ఇన్‌‌ చార్జి కమిషనర్ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. 

ఇటీవల తీసుకున్న చర్యలివీ..

  •     బల్దియా ప్రక్షాళనలో భాగంగా తొలుత నగరంలోని సుమారు 900 నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌‌ కు రీఅసెస్మెంట్ ప్రారంభించారు. ఏటా రూ.66 వేలు మాత్రమే చెల్లిస్తూ వస్తున్న పారమిత స్కూల్ బిల్డింగ్ ను రీఅసెస్మెంట్ చేయడంతో  ఇప్పుడు రూ.3.97 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి బిల్డింగ్స్ ను గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు సుమారు 500 వరకు పూర్తి కాగా.. రూ.2.50 కోట్ల ఆదాయం సమకూరింది.  
  •     కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం కూల్చేసిన కశ్మీర్ గడ్డ రైతు బజార్ టిన్ షెడ్లు కనిపించకుండాపోయాయి. షెడ్ల స్క్రాప్ మాయంపై విచారణ చేపట్టిన బల్దియా ఉన్నతాధికారులు ఏఈ గట్టుస్వామికి, అప్పటి డీఈఈ మసూద్‌‌  అలీకి చార్జి మెమో ఇచ్చారు. 
  •     పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి ఫారిన్ సర్వీస్ కింద కరీంనగర్ బల్దియాకు వచ్చి.. జమ్మికుంటలో పనిచేస్తూ కరీంనగర్ లో జీతం తీసుకుంటున్న ఏఈ ప్రభాకర్ ను తిరిగి సొంత శాఖకు సరెండర్‌‌ ‌‌  చేశారు.
  •     టౌన్ ప్లానింగ్ లో ఉద్యోగుల కొరత ఉండగా లాంగ్ లీవ్ పై వెళ్లిన డిప్యూటీ సిటీ ప్లానర్ వై.సుభాశ్‌‌ ను డీటీసీపీకి సరెండర్ చేశారు. వాస్తవానికి బల్దియాకు ఈ పోస్టు శాంక్షన్ కాలేదు. కానీ కొన్నేళ్లుగా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఆయనకు శాలరీ ఇస్తూ కొనసాగిస్తున్నారు. 
  •     బయో మెడికల్ వేస్ట్ ను సాధారణ చెత్తలో కలుపుతున్న హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్లకు రూ.లక్ష చొప్పున, మరో హాస్పిటల్ కు రూ.50 వేలు ఫైన్ వేశారు. 
  •     బల్దియాలో ఏళ్ల తరబడి ఒకే సెక్షన్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లతోపాటు శానిటరీ ఇన్ స్పెక్టర్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లను ఇంటర్నల్ ట్రాన్స్ ఫర్ చేశారు. 
  •     టౌన్ ప్లానింగ్ విభాగానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మున్సిపల్, రెవెన్యూ ఆఫీసర్లతో కమిటీ నియమించారు.
  •     వల్లంపహాడ్ లో ఓపెన్ ప్లాట్లపై అక్రమంగా ఇచ్చిన ఇంటి నంబర్లను గుర్తించడానికి ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, అక్రమ నంబర్లను తొలగిస్తున్నారు. ఇంటి నంబర్ల కేటాయింపు వ్యవహారంలోనే ఆర్వో ఆంజనేయులు, ఆర్ఐ రషీద్ కు చార్జీ మెమో జారీ చేశారు. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ బిల్‌‌  కలెక్టర్ ను సరెండర్ చేశారు.    
  •     నగరవ్యాప్తంగా ఇంటింటా నల్లాలు సర్వే చేసి, మాన్యువల్ గా చెల్లించిన బిల్లులను పరిశీలించి ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తున్నారు.