డబ్బు సంపాదించేందుకు రాలేదు.. ప్రజలకు సేవ చేసేందుకే వచ్చాను: గడ్డం వినోద్

  • గెలిచిన వెంటనే ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటా..
  • ప్రజల కోసం జీవిస్తా.. 

బెల్లంపల్లి, వెలుగు: తాను డబ్బు సంపాదించుకునేందుకు బెల్లంపల్లికి  రాలేదని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ స్పష్టం చేశారు. శుక్రవారం  బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు చెందిన  వేమనపల్లి, నీల్వాయి ఎంపీటీసీ రుద్రపట్ల సంతోష్, కన్నెపల్లి మండల బీఆర్ఎస్ నాయకుడు నర్సింగరావు లతో పాటు పలువురు బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, వైస్​ ఎంపీపీ తో పాటు మరో 600 మంది బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

వీరికి  కండువా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గెలిచిన వెంటనే ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటానన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో కాంగ్రెస్  నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తన తండ్రి వెంకటస్వామి సాక్షిగా బెల్లంపల్లిలోనే ఉంటానని ప్రకటించారు. అమెరికాలో ఉంటున్న తన కూతురు వర్షిణి  సాక్షిగా ఇక్కడ భూమి కొని ఇల్లు కట్టి, పాలు పొంగించి ఇంట్లోకి వెళ్తానని   ప్రమాణం చేశారు.  

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీలను ప్రజల నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ రోజు రోజుకూ పెరిగిపోతుందన్నారు.   రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. పార్టీ ఎమ్మెల్యే టికెట్  తీసుకున్న తర్వాత తొలిసారిగా  బెల్లంపల్లికి వచ్చిన వినోద్​కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  కార్యక్రమంలో  కేవీ ప్రతాప్,  మత్తమారి సూరి బాబు, కారుకూరి రామచందర్,  ముచ్చర్ల మల్లయ్య, సంగతి సత్యనారాయణ, రత్నం ప్రదీప్, ఈసా, పార్టీ అధ్యక్షులు,  ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు  కార్యకర్తలు పాల్గొన్నారు.