క్లైమేట్​ చేంజ్ ఇన్​ ది ఇండియన్ మైండ్​-2023  రిపోర్ట్​

క్లైమేట్​ చేంజ్ ఇన్​ ది ఇండియన్ మైండ్​-2023  రిపోర్ట్​

    యేల్​ ప్రోగ్రామ్​ ఆన్ క్లైమేట్​ ఛేంజ్​ కమ్యూనికేషన్, సీ ఒట్టర్ ఇంటర్నేషనల్​ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన క్లైమేట్​ ఛేంజ్ ఇన్​ ది ఇండియన్ మైండ్.​
    2023 నివేదిక ప్రకారం భారతదేశానికి గ్లోబల్​ వార్మింగ్​ అతి పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని జనాభాలో 90 శాతానికిపైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు వెల్లడైంది. 
    ఉష్ణతాపంతో వరదలు, కరవు, వడగాడ్పులు, తీవ్ర నీటి కొరత, కాలుష్యం, జంతువులకు వ్యాధులు సోకడం, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తోందని తేలింది. 
    భూతాపాన్ని తగ్గించేందుకు సంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించాలని, కర్బన్​ ఉద్గారాలను సున్నాకు తగ్గించాలని  వాతావరణ శాస్త్రవేత్తలు సూచించారు. 2070 నాటికి కర్బన్​ ఉద్గారాలను సున్నాకు తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు వేగంగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. 
    వాతావరణ మార్పులతో ప్రజల దైనందిన జీవితాలు దుర్భరంగా ఉంటున్నట్లు సర్వేలో తెలిసింది. వాతావరణ మార్పులతో కుటుంబాలకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. భూ తాపాన్ని తగ్గించేందుకు ఇంధన సామర్థ్య ఉపకరణాలు, విద్యుత్తు వాహనాల కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 
    మావన తప్పిదాలే భూతాపానికి కారణమని 52 శాతం మంది భావిస్తుంటే, 38 శాతం మంది పర్యావరణంలో సహజ మార్పులు ఈ పరిస్థితికి కారణమని చెప్పారు. బొగ్గు ఆధారిత ప్లాంట్లపై నిషేధం, ఉన్నవాటిని మూసివేసి వాటి స్థానంలో సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పేందుకు 84 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. 
    భూతాపాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలతో ఆర్థిక వృద్ధి, కొత్త ఉద్యోగాలు వస్తాయని 74 శాతం మంది భావిస్తే, ఆర్థిక మందగమనంతోపాటు ఉద్యోగాల్లో కోత పడుతుందని 21 శాతం మంది వెల్లడించారు.