పునర్వినియోగ ఇంధనాలతో క్లయిమేట్​ చేంజ్​కు చెక్​!

పునర్వినియోగ ఇంధనాలతో క్లయిమేట్​ చేంజ్​కు చెక్​!

వాతావరణ మార్పులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. క్లయిమేట్​చేంజ్ ​యూరప్‌ను అల్లాడిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్, హంగేరి, సెర్బియా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ తదితర దేశాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ, మధ్య, దక్షిణ యూరప్‌లో రెండు నెలలకు పైగా వాన చినుకు జాడ లేదు. గ్లోబల్ కరువు అబ్జర్వేటరీ తాజా నివేదిక ప్రకారం ఖండంలో 47 శాతం ప్రాంతం ప్రమాదకర కరువులో ఉంది. మక్క, సోయాబీన్, పొద్దుతిరుగుడు పంటల ఉత్పత్తి గత ఐదేండ్ల సగటుతో పోలిస్తే దాదాపు 15 శాతం పడిపోయింది. చైనాలోనూ కరువు చాయలు అలుముకున్నాయి. ఆ దేశంలో గత 70 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నదుల్లో నీరు లేక విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. కరెంట్​ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు వాడొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరువు సమస్యను అధిగమించడానికి ఇప్పుడా దేశం మేఘ మథనంపై దృష్టి పెట్టింది. వాతావరణ మార్పులకు కారణమవుతున్న కర్బన ఉద్గారాలు, కాలుష్యం వంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

ఉద్గారాల విడుదల
ప్రపంచవ్యాప్తంగా1990 నాటితో పోలిస్తే కార్బన్-డై-ఆక్సైడ్, గ్రీన్​హౌస్​ గ్యాసెస్​ఉద్గారాలలో 40 శాతం పెరుగుదల నమోదైందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఉద్గారాల పెరుగుదలలో భారత్ పాత్ర కూడా గణనీయంగా ఉంది. ఏటా మూడు బిలియన్ టన్నుల ఉద్గారాలతో ప్రపంచంలో ఇండియా రెండో స్థానంలో ఉంది.  వరల్డ్ ఎయిర్ క్వాలిటీ నివేదిక ప్రకారం అత్యంత వాయు కాలుష్యం గల మొదటి 50 సిటీల్లో బివాడి, ఘజియాబాద్, ఢిల్లీ,  కాన్పూర్, నోయిడా, హిసార్, ఫరీదాబాద్ వంటి 35 నగరాలు ఇండియాలోనే ఉన్నాయి. పెరుగుతున్న వాహనాలు, సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల తదితర కారణాలతో గాలి నాణ్యత తగ్గుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం బాగా పెరిగింది. దీంతో విషపూరిత వ్యర్థాలు విడుదలై భూమి, జలవనరులు, గాలి కలుషియతం అవుతోంది. అందుకే ఈ ఏడాది జులై 1 నుంచి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. వాతావరణ మార్పులు, పర్యావరణ సమస్యలను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను గుర్తించి, గత నవంబర్ లో గ్లాస్గోలో జరిగిన కాప్​26 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ  వచ్చే 25 ఏండ్లకు సంబంధించిన పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళికను వెల్లడించారు.

ప్రత్యామ్నాయ చర్యలు
ఇథనాల్ మొక్కల నుంచి లభించే జీవ ఇంధనం ఒక పునరుత్పాదక వనరు. ఇథనాల్ మిశ్రమ వాహన ఇంధనాన్ని పొందేందుకు 99 శాతం స్వచ్ఛమైన ఇథైల్ ఆల్కహాల్ ను పెట్రోల్​లో కలుపుతారు. ఇందులో ఆక్సీజన్ పరిమాణం ఎక్కువగా ఉండి కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది. ప్రస్తుతం10 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలియం వాడుతుండగా, 2030 నాటికి పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలిపే అవకాశం ఉందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలియంను బైకుల్లో వాడటం వల్ల హైడ్రోకార్బన్​ల ఉద్గారాలను తగ్గించడమే కాకుండా 50 శాతం కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. 4  చక్రాల వాహనాల్లో 30 శాతం కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలదని అంచనా. కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదల కావడానికి ముందే తొలగించేందుకు కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్(సీసీఎస్) విధానం అందుబాటులోకి వచ్చింది. దీన్ని డెవలప్​ చేసేందుకు ఇండియా విదేశాలతో కలిసి పనిచేస్తోంది. థర్మల్, జల విద్యుత్ కేంద్రాలతోపాటు మనదేశంలో పవన, సౌరశక్తి కేంద్రాల ఏర్పాటుకు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పథకాలు రూపొందిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి పెట్టడంతోపాటు, విధానపరమైన నిర్ణయాలు అవసరం. ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందించి అమలుపరుస్తున్నా.. పర్యావరణ పునరుద్ధరణకు వ్యక్తులుగా ఎవరి పాత్ర వారు సరిగా నిర్వర్తించకపోతే ఆశించిన లక్ష్యం నెరవేరదు. సమష్టి కృషి అవసరం.

- డా. చిందం రవీందర్, ఎంఎస్సీ, ఎంఎడ్. పీహెచ్ డీ