అర్ధ శతాబ్దం నుంచి పర్యావరణ వేత్తలు, శాస్త్రజ్ఞులు చెబుతూనే ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో కొన్ని నగరాలు మునిగిపోతాయని, అది ఇప్పుడు నెమ్మదిగా కార్యరూపం దాలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మునుగుతున్న నగరాలు, కుంగిపోతున్న పట్టణాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. పారిశ్రామిక శతాబ్దిలో ఆధునికంగా ప్రపంచం ఎంత ముందుకు వెళ్లినా, పర్యావరణపరంగా అంతకంతకూ దిగజారిపోయింది. వాతావరణ మార్పులతో ఈ భూమిపై చాలా దేశాలు, అందులోని నగరాలు, పట్టణాలు పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. కొన్ని సముద్రగర్భంలో కలిసిపోతుంటే, మరికొన్ని భూకంపాలు ఇతరత్రా వైపరీత్యాల వల్ల భూగర్భంలో సమాధి అవుతున్నాయి. విపరీత కాలుష్యం కారణంగా వాతావరణ మార్పుల వేగం పెరిగి, అంటార్కిటికాలో గత 25 ఏండ్లలో 3 లక్షల టన్నుల మంచు కరిగిపోయినట్లు తాజాగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు 9 మిల్లీమీటర్ల మేర పెరిగాయని వెల్లడైంది. ప్రపంచంలో తీర ప్రాంతాల్లో ఉండే దేశాలకు, నగరాలకు పెనుముప్పు ముంచుకువస్తోంది.
రాజధాని మార్పు
ఇండోనేషియా రాజధాని జకార్తా.. రెండు వేల కిలోమీటర్ల దూరంలో పచ్చని అటవీ ప్రాంతంలో, ఆధునిక హంగులతో కొత్త రాజధాని ‘నుసంతర’కు తరలిపోతోంది. దేశంలోని సుందరమైన బోర్నియో ద్వీపంలోని విశాల అటవీ ప్రాంతంలో నూతన రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఇండోనేషియా కొత్త రాజధాని ఎందుకు నిర్మిస్తోందంటే..! ఆ దేశం అనేక దీవుల సమాహారం. ఎక్కువ భాగం అటవీ ప్రాంతం కావడం వల్ల నేలపై జనాభా ఒత్తిడి ఎక్కువ. జావా ద్వీపంలోని రాజధాని జకార్తా ఇప్పటికే కోటి మందికి పైగా జనాభాతో కిక్కిరిసింది. గ్రేటర్ మెట్రోపాలిటన్ ప్రాంతలోని జనాభా ఇంతకు మూడు రెట్లు అధికంగా ఉంటుంది. మరో పక్క జావా సముద్ర తీరంలోని ఆ నగరం ఏటేటా కొన్ని సెంటీమీటర్లు భూమిలోకి కుంగిపోతోంది. వివిధ నివేదికల ప్రకారం 2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక వంతు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడేయడం, వాతావరణ మార్పులు వంటివి ముఖ్య కారణాలు కాగా, ఈ నగరానికి భూకంప ముప్పూ పొంచి ఉంది. దీంతో కొత్త రాజధానిని నిర్మించుకోవాలని ఇండేనేషియా ప్రభుత్వం సంకల్పించింది. అయితే అక్కడ కూడా పర్యావరణ హననమే. ఇండోనేషియా నిర్మిస్తున్న కొత్త రాజధాని నిర్మాణంపై పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వ లెక్కల ప్రకారం 2,56,142 హెకార్ల భూమిని సేకరిస్తున్నారు. దీంతో ఆ అటవీ ప్రాంతంలో ఒరాంగుటాన్, సన్బేర్స్ వంటి అరుదైన వన్యప్రాణుల మనుగడకు ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు. స్థానిక గిరిజన జాతులు తమ స్వస్థలాలను వీడేందుకు నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే అక్కడి స్థానిక ప్రజల తరలింపు మొదలైంది.
అంతరించిపోతున్న దీవులు
పర్యాటక రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందిన లక్షదీవులు 32 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం 2080–-2100 మధ్యకాలంలో ఏడాదికి 0.78 మిల్లీమీటర్ల మేర జలాలు పెరుగుతాయని తెలిసింది. దీంతో ఈ చిన్న దీవులు అంతరించిపోయే ప్రమాదముంది. ఇక్కడ నివసిస్తున్న దాదాపు 64 వేల మంది అస్థిత్వం ప్రమాదంలో పడింది. ఇలాంటి ప్రమాదంలోనే అండమాన్, నికోబార్ దీవులు, తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి తీరానికి దగ్గరలో, భారత్‌కు, శ్రీలంకకు మధ్యలో ఉన్న వహాన్ ఐలాండ్1969 నాటికి 20.08 హెక్టార్లలో వ్యాపించి ఉంటే, ప్రస్తుతం ఈ ద్వీపం 2.33 హెక్టార్లకు తగ్గిపోయి మునుగుతున్న కన్నీటిచుక్కలా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే కేరళ రాష్ట్రం కొల్లం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ద్వీపానిదీ అదే పరిస్థితి. ఇలా అభివృద్ధి పేరుతో మానవజాతి దురాశ, దురాక్రమణల ఫలితంగా ప్రకృతి విలవిలలాడిపోతోంది. పారిశ్రామిక అభివృద్ధి, భారీ ప్రాజెక్టులు, అక్రమ మైనింగ్ వంటి కార్యకలాపాల వల్ల సుందరమైన, ప్రకృతి రమణీయమైన ఎన్నో ద్వీపాలు, పట్టణాలు, నగరాలు అంతర్థానమయ్యే ప్రమాదం ఉన్నా ప్రభుత్వాలు మేల్కోవడం లేదు. రాబోయే సంవత్సరాల్లో వాతావరణ మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో 0.8 మిల్లీ మీటర్లు నుంచి మరికొన్ని ప్రాంతాల్లో 5 మిల్లీమీటర్ల వరకూ సముద్ర మట్టం పెరుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా ప్రభుత్వాల్లో ఇసుమంతమైన చిత్తశుద్ధి లేదు. ఇదిలాగే ఉంటే మానవజాతి అభివృద్ధి ఏమో కానీ,‘కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే’ అని భవిష్యత్తు మనకు తెలుపుతుంది.
తువాలు పరిస్థితి..
ఇండోనేషియా పరిస్థితి అలా ఉంటే.. ఒక ద్వీప దేశం ఏకంగా సముద్రగర్భంలో కలిసిపోబోతోంది. ఆస్ట్రేలియా, హవాయిల మధ్య ఉన్న తొమ్మిది దీవుల సమూహం ‘తువాలు’ అనే ద్వీపదేశం వాతావరణ మార్పుల వల్ల సముద్రంలో కలిసిపోతోంది. ఇప్పటికే తువాలు రాజధాని ప్రాంతం 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి తువాలు పూర్తిగా కనుమరుగైపోవడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్‌కు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముంపు ప్రమాదం బారిన పడే దేశాల్లో మన దేశం కూడా ఉంది. మన దేశానికి మూడు వైపులా సముద్ర తీరం ఉంది. చుట్టూ1382 ద్వీపాలు ఉన్నాయి. సముద్రం, నదుల కోత, మడ అడవుల నరికివేత, ఉష్ణోగ్రత పెరుగుదల, అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా ఈ ద్వీపాలు రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా మనిగిపోయే ప్రమాదం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వాలు తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టకపోతే ఈ దీవులు అదృశ్యం కావడం తథ్యమంటున్నారు. ఇప్పటికే లక్ష దీవుల్లోని ఒక ద్వీపం పూర్తిగా కనిపించడం లేదని చెబుతున్నారు. ఇలా మరికొన్ని ద్వీపాలు ఉన్నాయి.
–మోతె రవికాంత్, వ్యవస్థాపక అధ్యక్షులు, సెఫ్