వాఘా బార్డర్​ క్లోజ్ .. పాకిస్తాన్​ పౌరులకు నో ఎంట్రీ

వాఘా బార్డర్​ క్లోజ్ .. పాకిస్తాన్​ పౌరులకు నో ఎంట్రీ
  •  సింధూ జలాల ఒప్పందం రద్దు
  • కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు
  • పహల్గాం టెర్రర్​ అటాక్​ వెనుక పాకిస్తాన్​ హస్తం ఉందని ప్రకటన
  • ప్రధాని అధ్యక్షతన కేబినెట్​ అత్యవసర భేటీ
  • సెక్యూరిటీపై రెండున్నర గంటలపాటు చర్చ
  • టెర్రరిజాన్ని సహించేది లేదని హెచ్చరిక
  • ఇండియాను వీడాలని పాక్​ హైకమిషన్​ ఆఫీసర్లకు ఆదేశం..
  • ఏప్రిల్​ 22న ఆల్​​ పార్టీ మీటింగ్

న్యూఢిల్లీ: పాకిస్తాన్​ పౌరులు భారత్​ నుంచి 48 గంటల్లో వెనక్కి పోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వాఘా, అటారీ బార్డర్​ను మూసేస్తున్నామని ప్రకటించింది. 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. పహల్గాం టెర్రర్​ అటాక్​ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం భద్రతా వ్యవహారాల కేబినెట్​ కమిటీ (సీసీఎస్​) అత్యవసరంగా సమావేశమైంది. 

దేశ భద్రతపై రెండున్నర గంటలపాటు చర్చించింది. ఉగ్రవాదం పీచమణచాలని నిర్ణయించింది. పహల్గాంలో టూరిస్టులపై జరిగిన టెర్రర్​ అటాక్​ వెనుక పాకిస్తాన్​ హస్తం ఉందని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని  పేర్కొంది. టెర్రరిజాన్ని సహించేది లేదని, దాన్ని ప్రోత్సహించేవాళ్లను కూడా వదిలిపెట్టబోమని వార్నింగ్​ ఇచ్చింది. 

ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చింది. పాకిస్తాన్​ నుంచి వచ్చిన పర్యాటకులు, ప్రత్యేక వీసాదారులు ఇండియా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తాన్​కు ఇచ్చే ప్రత్యేక వీసాలను క్యాన్సిల్​ చేసింది. సార్క్​ వీసా ఎగ్జెంప్షన్​ స్కీమ్ (ఎస్​వీఈఎస్​) కింద పాకిస్తానీలను ఇండియాకు అనుమతించబోమని.. ఇప్పటికే ఈ వీసా కింద ఇండియాకు వచ్చినవాళ్లు 48 గంటల్లో వెళ్లిపోవాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. 

ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పాక్​ హైకమిషన్​లో ఉన్న ఆ దేశ డిఫెన్స్​, నేవీ, ఎయిర్​ అడ్వయిజర్స్​ను వారం రోజుల్లో వెనక్కి వెళ్లిపోవాలని.. ఇస్లామాబాద్​లోని భారత హైకమిషన్​లో ఉన్న మన డిఫెన్స్​, నేవీ, ఎయిర్​ అడ్వయిజర్స్​ను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. ఇరు దేశాల్లోని హైకమిషన్​ స్టాఫ్​ను 55 నుంచి 30కి కుదించింది. ఇది మే 1 నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.  

మోదీకి పరిస్థితిని వివరించిన అమిత్​ షా

కేబినెట్​ కమిటీ నిర్ణయాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్​ మిస్త్రీ మీడియాకు వెల్లడించారు. టెర్రర్​ అటాక్​లో మృతిచెందిన వారికి కేబినెట్​ నివాళులర్పించిందని, కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. అటాక్​ వెనుక పాకిస్తాన్​ హస్తం ఉన్నట్లు బలంగా నమ్ముతున్నామని, టెర్రరిజాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని అన్నారు. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్​ కమిటీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, విదేశాంగ మంత్రి జైశంకర్​, నేషనల్​ సెక్యూరిటీ అడ్వయిజర్​ అజిత్ దోవల్​, సీనియర్​ అధికారులు పాల్గొన్నారు. 

కమిటీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్​ కూడా మెంబర్​ అయినప్పటికీ ఆమె అమెరికా పర్యటనలో ఉండటంతో అటెండ్​ కాలేదు. జమ్మూకాశ్మీర్​లోని  పరిస్థితిని మీటింగ్​లో ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వివరించారు. మంగళవారం అటాక్​ జరిగిన సమయంలో మోదీ సౌదీలో ఉన్నారు. 

వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని అక్కడి నుంచే అమిత్​ షాకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో జమ్మూకాశ్మీర్​ వెళ్లిన అమిత్​ షా.. అక్కడి పరిస్థితులను పరిశీలించి, సీసీఎస్​ మీటింగ్​లో వివరించారు.  కాగా, సౌదీ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని బుధవారం ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ.. కేబినెట్​కమిటీ  అత్యవసర భేటీ నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు ఈ సమావేశంలో జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  

ఏప్రిల్​ 24న  ఆల్​ పార్టీ మీటింగ్!​

పహల్గాం టెర్రర్​ అటాక్​ నేపథ్యంలో ఆల్​ పార్టీ మీటింగ్​కు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.  రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఆధ్వర్యంలో గురువారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి.