- 42 పాయింట్లు తగ్గిన నిఫ్టీ.. 39 పైసలు తగ్గిన రూపాయి
ముంబై: ఇటీవలి ర్యాలీతో ఊపిరి పీల్చుకున్న స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఈవారం చివర్లో ఆర్బీఐ వడ్డీరేట్లపై నిర్ణయం ప్రకటించాల్సి ఉండటం, వాణిజ్య యుద్ధ ఆందోళనల నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించారు. రూపాయి విలువ రికార్డు స్థాయిలో 39 పైసలు పతనం కావడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 312.53 పాయింట్లు క్షీణించి 78,271.28 వద్ద స్థిరపడింది. ఇందులోని 21 షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో 367.56 పాయింట్లు తగ్గి 78,216.25కి చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 42.95 పాయింట్లు తగ్గి 23,696.30కి చేరుకుంది.
ఇంట్రాడేలో 23,807.30 గరిష్ట స్థాయి, 23,680.45 కనిష్ట స్థాయి మధ్య కదలాడింది. సెన్సెక్స్లో ఆసియన్ పెయింట్స్ 3 శాతానికి పైగా పడిపోయింది. టైటాన్, నెస్లే, హిందూస్తాన్ యూనిలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లార్సెన్ అండ్ టూబ్రో, ఐటీసీ, జొమాటో బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా వెనకబడ్డాయి. అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో లాభాల్లో, హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు నెగటివ్‌గా ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి.